జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది కానుకను అందించింది. కార్లు, జీపులు, వ్యాన్ల వంటి ప్రైవేట్ వాహనాల FASTag వెరిఫికేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1, 2026 నుండి కొత్తగా జారీ చేసే ఫాస్ట్ ట్యాగ్ లకు కేవైవీ ప్రక్రియను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్న తర్వాత వాహనదారులు పదే పదే ఫోటోలు అప్‌లోడ్ చేయడం, బ్యాంకుల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులను తొలగించడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
సాధారణంగా ఫాస్ట్ ట్యాగ్ కొనే సమయంలోనే వాహనదారులు అన్ని పత్రాలను సమర్పిస్తారు. అయితే ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ అయిన తర్వాత మళ్లీ కేవైవీ వెరిఫికేషన్ పేరుతో తిరగాల్సి వచ్చేది. దీనివల్ల చాలా మందికి టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్యాగ్ ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాగే వారి ఖాతాలు బ్లాక్ అవ్వడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు. కానీ.. ఫిబ్రవరి 1 నుండి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇలాంటి వాటి నుంచి విముక్తి కలిగించనున్నాయి యజమానులకు. ఇకపై ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసే ముందే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అంటే వాహనదారుడికి ఫాస్ట్ ట్యాగ్ అందుకున్న మరుక్షణమే అది పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.
ఇక ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్ వాడుతున్న వారికి కూడా ఇది ఊరట కలిగించే విషయమే. పాత వాహనదారులు కూడా ఇకపై రెగ్యులర్‌గా KYV అప్‌డేట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఫాస్ట్ ట్యాగ్ సరిగ్గా అతికించకపోయినా.. ఒక వాహనం ఫాస్ట్ ట్యాగ్ ను మరో వాహనానికి వాడినా లేదా ఏవైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి వివాదాలు లేకపోతే పాత ఫాస్ట్ ట్యాగ్స్ యథావిధిగా పనిచేస్తాయి. దీనివల్ల లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులకు "డిజిటల్ వేధింపుల" నుంచి విముక్తి లభించనుంది.
ఈ కొత్త వ్యవస్థలో పూర్తి బాధ్యతను NHAI బ్యాంకులపై ఉంచింది. ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసే బ్యాంకులు వాహన్ డేటాబేస్ ద్వారా వాహన వివరాలను ముందే సరిచూసుకోవాలి. ఒకవేళ వాహన్ పోర్టల్‌లో డేటా లేకపోతే మాత్రమే ఆర్సీ కాపీని తనిఖీ చేయాలి. ఆన్‌లైన్‌లో కొనే ఫాస్ట్ ట్యాగ్ లకు కూడా ఇదే రూల్స్ వర్తిస్తాయి. వెరిఫికేషన్ బాధ్యతను బ్యాంకులకే అప్పగించడం వల్ల వాహనదారులపై భారం తగ్గడమే కాకుండా.. టోల్ చెల్లింపులు మరింత వేగంగా, పారదర్శకగా సాగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
