స్కిల్ డెవలప్​​మెంట్​ కేసు..సుప్రీంలో బాబుకు చుక్కెదురు

స్కిల్ డెవలప్​​మెంట్​ కేసు..సుప్రీంలో బాబుకు చుక్కెదురు
  •      17 ఏ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన బెంచ్
  •     సీజేఐకి రెఫర్ 
  •     రిమాండ్ ఆదేశాలను కొట్టివేయలేమని వ్యాఖ్య


న్యూఢిల్లీ, వెలుగు : ఏపీ స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు సుప్రీంలో చుక్కెదురైంది. ఈ కేసులో రిమాండ్ ఆదేశాలను క్వాష్ చేయడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది‌‌.‌‌ అయితే 17–ఏ పై ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. తదుపరి చర్యల కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) కు నివేదించింది. స్కిల్ డెవలప్‌‌మెంట్ కేసు అక్రమమని, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌‌ను రద్దు చేయాలని గతేడాది సెప్టెంబర్ లో చంద్ర బాబు ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో సెప్టెంబర్  23 న బాబు.. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. 

గవర్నర్ అనుమతి లేకుండా ఏపీ సీఐడీ తనపై దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో చంద్రబాబు తరఫు సీనియర్ అడ్వకేట్లు సిద్దార్థ లూత్రా, హరీశ్​ సాల్వే.. ఏపీ సర్కార్ తరపు సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. పలు దఫాలుగా ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ఇద్దరు సభ్యుల బెంచ్ అక్టోబర్ 17న విచారణ ముగిస్తూ... తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. 

భిన్నాభిప్రాయాలు..

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇద్దరు జడ్జిలు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. భిన్న తీర్పులు వెలువరించినందున ఈ కేసును విస్తృతస్థాయి ధర్మాసనానికి రెఫర్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసు సీజేఐ ముందుకు చేరింది. 17-ఏ వర్తింపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్‌‌కి నివేదిస్తున్నామని జస్టిస్ బేలా ఎం. త్రివేది వెల్లడించారు. చట్టం అమల్లోకి వచ్చిన తరువాత నమోదైన కేసులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. 

2018లో వచ్చిన చట్టం ఆధారంగా చంద్రబాబు పిటిషన్‌‌ను కొట్టివేయలేమని అభిప్రాయపడ్డారు. "చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి 17-ఏ వర్తింపజేయలేం. 2018లో వచ్చిన చట్ట సవరణలో సెక్షన్ 17(ఏ) నాటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదు. ఈ పరిస్థితుల్లో చట్టం రాక ముందు కాలానికి దాన్ని వర్తింపజేయలేం. ఈ కేసులో సెక్షన్ 17(ఏ)ను తీసేసి కొత్త నేరాలకు మాత్రమే దాన్ని వర్తింపచేయాలి. 2018లో చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు నాటి సెక్షన్ల ప్రకారమే కేసు విచారణ జరపాలి. చట్టం రాకముందు కాలానికి దీన్ని వర్తింపజేస్తే అనేక సరికొత్త వివాదాలకు తెరలేపినట్టు అవుతుంది.

 దీన్ని అంగీకరిస్తే అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులన్నీ నిరర్థకం అవుతాయి. ఆ చట్టం మూల ఉద్దేశం దెబ్బతింటుంది. అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం సెక్షన్ 17(ఏ) మూల ఉద్దేశం కాదు. ఈ సెక్షన్ అమల్లోకి రాకముందు కాలానికి వర్తింపజేస్తే అనేక పెండింగ్ కేసులు, విచారణలు ప్రభావితమవుతాయి. ఐపీసీ సెక్షన్లు కూడా నమోదై ఉన్నప్పుడు.. కేవలం సెక్షన్ 17(ఏ) ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అన్నది ఎఫ్ఐఆర్ కొట్టేయడానికి కారణం కారాదు" అని అన్నారు.

బాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది..

అంతకుముందు జస్టిస్ అనిరుద్ధ బోస్ తన తీర్పును చదివి వినిపించారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ పర్మిషన్​ తీసుకోవాల్సి ఉందని బోస్ స్పష్టం చేశారు. తగిన నివేదిక కోసం సీజేఐకి నివేదించామని చెప్పారు. స్కిల్​డెవలప్‌‌మెంట్ కేసులో సెక్షన్ 17(ఏ) వర్తిస్తుంది. ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. "ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్ట విరుద్ధం. ఈ పరిస్థితుల్లో బాబును అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)సీ, డీ, 13(2) ప్రకారం విచార ణ చేయడం తగదు. అయితే రిమాండ్ ఆర్డర్‌‌ను క్వాష్ చేయడం కుదరదు. ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదనలేం. ఈ పరిస్థితుల్లో పిటిషన్‌‌ను డిస్పోస్ చేస్తున్నాం" అని పేర్కొన్నారు.