భద్రాచలంలోని వరద బాధిత కుటుంబాలను పరామర్శించనున్న బాబు

భద్రాచలంలోని వరద బాధిత కుటుంబాలను పరామర్శించనున్న బాబు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా సరిహద్దులోని వరద ముంపు మండలాల ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. గోదావరి వరద బాధితులను కలుసుకోడానికి ఆయన రెండు రోజుల పాటు ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. పోలవరం విలీన మండలానికి చేరుకున్న బాబుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మత్స్సకారులు, మహిళలు బాబు చూసేందుకు పోటీ పడ్డారు. భారీ వర్షాల కారణంగా గోదావరి నది మహోగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. భారీ వరదల కారణంగా అటు తెలంగాణ ఇటు ఏపీలోని గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భద్రాచలంతో పాటు చుట్టుపక్కల మండలాలన్నీ రోజుల తరబడి నీటిలోనే ఉండిపోయాయి.

వరద ప్రాంతాలను సందర్శించాలని బాబు నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. 28వ తేదీ గురువారం ఉదయం 8.గంలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బాబు బయలుదేరారు. విజయవాడకు చేరుకున్న అనంతరం మైలవరం, తిరువూరుకు వచ్చారు. ఉదయం 10గం.లకు పెనుబల్లిలో వరద బాధితులను పరామర్శించారు. సత్తుపల్లి నుంచి అశ్వరావుపేట ద్వారా వినాయకపురం చేరుకుంటారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు, బూర్గంపాడు, సారపాక, ప్రాంతాల్లోని గోదావరి వరద బాధిత కుటుంబాలను బాబు పరామర్శిస్తారు. అనంతరం గురువారం రాత్రి భద్రాచలంలో బసచేసి శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీరాముని దర్శనం చేసుకుంటారు. అనంతరం గోదావరి కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించి భద్రాచలంలోని వరద బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు.