కరోనా విషయంలో ప్రభుత్వం బాధ్యతగా లేదు

కరోనా విషయంలో ప్రభుత్వం బాధ్యతగా లేదు

కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతోందన్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం ఆయ‌న క‌రోనాపై మీడియా స‌మావేశంలో మాట్లాడారు. యూఎస్, స్పెయిన్, ఇటలీలో కరోనా విజృంభిస్తోంది. ఏపీలో వారంలో 1,021 శాతం కరోనా పెరిగిందని, ఇది చాలా ప్రమాదక‌ర‌మ‌న్నారు. దేశంలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని.. ఏపీలో కరోనా పరీక్షల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఏపీలో కేవలం 6 ల్యాబ్‌లే ఉన్నాయని, టెస్టింగ్‌లు చాలా తక్కువ జ‌రుగుతున్నాయ‌న్నారు చంద్ర‌బాబు.

ఏపీలో రోజుకు ఎంతమందికి టెస్టులు చేస్తున్నారో ప్రభుత్వం చెప్పడం లేదని.. వాస్తవాలు బయటకు చెప్పకపోవడం చాలా ప్రమాదకరమ‌న్నారు. బాధ్యతకలిగిన వ్యక్తులు జాగ్రత్తగా మానిటర్ చేయాలని తెలిపారు. వ్యక్తి, వ్యవస్థ విఫలమైతే చాలా ప్రమాదం వాటిల్లుతుందన్న చంద్ర‌బాబు.. కరోనా విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ, ప్రజలు సహకరించాలని సూచించారు. ప్రధాని పిలుపునకు ఆదివారం దేశ ప్రజలంతా సంఘీభావం తెలిపారని.. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ఇంటి పరిసరాలను ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు చంద్ర‌బాబు.