
కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తెలిపారు. కాషాయ పార్టీని వ్యతిరేకించే ఏ పార్టీనైనా తాము కలుపుకొని పోతామని, చివరికి టీఆర్ఎస్ వచ్చినా స్వాగతిస్తామని అన్నారు. గ్రాండ్ అలయెన్స్ ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరీ, ఆప్ చీఫ్ అరవింద్కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. కూటమి ఏర్పాటుపై చర్చించారు.
శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీని, లక్నోలో బీఎస్పీ చీఫ్ మాయావతిని కూడా చంద్రబాబు కలువనున్నారు. ఏపీలోని చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారంపై ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీయేతర పార్టీలన్నింటిని కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. టీఆర్ఎస్ కలిసి వచ్చినా పనిచేస్తారా అని మీడియా ప్రశ్నించగా.. మరీ ఊహాత్మక ప్రశ్నలు వద్దని సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా కలిసి ముందుకు వెళ్తామని, ఒక్క టీఆర్ఎస్ మాత్రమే కాదు ఏ పార్టీ వచ్చినా స్వాగతిస్తామని చెప్పారు.