మా వల్లే తెల్లబువ్వ తింటున్రు : చంద్రబాబు

మా వల్లే తెల్లబువ్వ తింటున్రు : చంద్రబాబు

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెల్ల బియ్యాన్ని పండుగ బువ్వగా, స్వామి బువ్వగా భావించే రోజుల్లో ప్రతి పేదవాడు తెల్ల బియ్యం తినేలా చేసిన క్రెడిట్ టీడీపీదేనని టీడీపీ అన్నారు. ఆహార భద్రత చట్టం రాకముందే 40ఏళ్ల క్రితమే దాన్ని టీడీపీ అమలు చేసిందని చెప్పారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ రాజకీయ నేత అజ్ఞాన అహంకార వ్యాఖ్యలు చేశారని పలువురు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణలో పార్టీపై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు తెలంగాణలో  ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం తెలంగాణలో టీడీపీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ రూపొందించిన 1000కరపత్రాలు, పెన్ను, పుస్తకం, బొట్టుబిళ్లలతో కూడిన కిట్లను పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన పంపిణీ  చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో మౌళిక వసతులు కల్పించిన ఘనత కూడా టీడీపీదేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ కు భారత రత్న పురస్కారం ఇవ్వడం భారతదేశానికే గర్వకారణమన్న చంద్రబాబు తెలుగువారి ఆ డిమాండ్ నెరవేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను ఇక్కడే ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఆ కార్యక్రమాన్ని పెద్దఎత్తున విజయవంతం చేయాలని చంద్రబాబు కోరారు. సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడం, అభివృద్ధి చేయడమే టీడీపీ ధ్యేయమన్న ఆయన.. తెలుగువారు ఎక్కడున్నా వారి కోసం టీడీపీ పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణలో సంపద సృష్టించడానికి కారణం టీడీపీనే అని గర్వంగా చెప్పారు. పేదలను నాయకులుగా ప్రమోట్ చేసిన పార్టీ కూడా తెలుగుదేశమేనని చంద్రబాబు కామెంట్ చేశారు.