
అమరావతి, వెలుగు: ఏపీ అభివృద్ధి కోసం నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. మంగళవారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తర్వాత కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు.’కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీకి కొంత సమయం ఇవ్వాలి. ఏవేవో చేస్తామని హామీ ఇచ్చారు. వాటిని చెయ్యనివ్వండి. ప్రభుత్వ పనితీరు, పాలన చూశాక ఎలాంటి అడుగులెయ్యాలో నిర్దేశించుకుందాం. ఈ ఎన్నికల్లో టీడీపీకి 40 శాతం మంది ప్రజలు ఓట్లేశారు. వారికి సేవ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.’అని అన్నారు. ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో పనిచేశామని, అయినా ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు తీసుకుని పార్టీలో తగిన మార్పలు చేర్పులు చేస్తామని చెప్పారు. తెలుగు ప్రజలకు మరోసారి సేవలు అందించేందుకు టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.