‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో చంద్రబాబు మేనిఫెస్టో

‘భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో చంద్రబాబు మేనిఫెస్టో
  • ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీ
  • నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి
  • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తం

తమ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబంలోని ప్రతి బిడ్డ చదువుకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తామని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ‘తల్లికి వందనం’ పేరుతో ఈ పథకం అమలు చేస్తామని, కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికీ సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏపీలోని రాజమండ్రిలో ఆదివారం నిర్వహించిన టీడీపీ మహానాడులో చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా ఆయన మేనిఫెస్టో విడుదల చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. అంతేకాకుండా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. ‘యువగళం’ పథకం కింద ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అన్నదాత కింద రైతులకు ఏటా రూ.20 వేలు

‘అన్నదాత’ కార్యక్రమం కింద ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘‘ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్  ఇచ్చి తాగునీరు అందిస్తం. సంపద సృష్టించి ప్రజలకు పంపిణీ చేస్తం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తం” అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.