హైదరాబాద్, వెలుగు: తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత చంద్ర శేఖర్ రెడ్డి దంపతులు కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి అందించారు. చంద్ర శేఖర్ రెడ్డి, ఆయన భార్య ఇందుప్రియ.. గురువారం గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. మల్లు రవి మాట్లాడుతూ.. షబ్బీర్ అలీని ఆదివారం కమిటీ ముందుకు రావాలని ఆదేశించినట్లు చెప్పారు.
ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కమిటీ నిర్ణయం ఉంటుందన్నారు. నేతలు ఎవరైనా సరే వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్దవద్దని సూచించారు. చంద్ర శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మల్లు రవిని కలిసి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చామని, వారం రోజుల్లో అన్ని విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. షబ్బీర్ అలీ విషయంలో కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
