చంద్రుడి ఫొటోలను తీసేందుకు చంద్రయాన్-2 రెడీ

చంద్రుడి ఫొటోలను తీసేందుకు చంద్రయాన్-2 రెడీ

చంద్రయాన్​ 2 మిషన్​లో భాగంగా 14 పేలోళ్లను చంద్రుడిపైకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కసరత్తు చేస్తోంది. జూలై 9 – జూలై 16 మధ్య చంద్రయాన్​ 2 ప్రయోగాన్ని చేస్తామంటూ ఇటీవల ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. ల్యాండర్​, రోవర్​, ఆర్బిటర్​లను చంద్రుడిపైన దించనుంది. స్పేస్​క్రాఫ్ట్​ చంద్రుడిపై దిగాక సైంటిఫిక్​ టెస్టులు చేసేందుకు, చంద్రుడి ఫొటోలను తీసేందుకు ఈ పేలోళ్లు లేదా ప్రయోగ మాడ్యూళ్లను ఇస్రో పంపుతోంది. ఆర్బిటర్​లో 8, ల్యాండర్​ విక్రమ్​లో 4, రోవర్​ ప్రజ్ఞాన్​లో 2 పేలోళ్లను పంపే ఏర్పాట్లు చేస్తోంది. 2008లో చేసిన చంద్రయాన్​కు భిన్నంగా ఈ ప్రయోగం సాగబోతోంది. అప్పుడు ఐదు విదేశీ పేలోళ్లను తీసుకెళ్లగా, ఇప్పుడు విదేశీ పేలోళ్లు లేకుండానే ప్రయోగం జరపబోతోంది. సెప్టెంబర్​ 6 నాటికి స్పేస్​క్రాఫ్ట్​ చంద్రుడిపై దిగుతుందన్న విషయం తెలిసిందే.

ఈ ప్రయోగాన్ని జీఎస్​ఎల్వీ మార్క్​3 లాంచ్​ వెహికల్​తో చేయబోతున్నారు. ఆర్బిటర్​, ల్యాండర్​ మాడ్యూళ్లను (ఇంటిగ్రేటెడ్​ మాడ్యూల్​) కలిపి రాకెట్​లోకి ఎక్కిస్తారు. రోవర్​ను ల్యాండర్​లో పెట్టి పంపిస్తారు. ప్రయోగం తర్వాత 45 నుంచి 50 రోజులకు ఆర్బిటర్​ ప్రొపల్షన్​ మాడ్యూల్​ సాయంతో చంద్రుడి కక్ష్యలోకి ఇంటిగ్రేటెడ్​ మాడ్యూల్​ ప్రవేశిస్తుంది. వెంటనే విక్రమ్​ ఆర్బిటర్​ నుంచి నుంచి విడిపోయి చంద్రుడి దక్షిణ ధ్రువంపై నెమ్మదిగా దిగుతుంది. నిజానికి ఈ ప్రయోగాన్ని గత ఏడాది ఏప్రిల్​లోనే నిర్వహించాల్సి ఉన్నా ప్రయోగంలోని సంక్లిష్టతల వల్ల ఇస్రో వాయిదా వేస్తూ వస్తోంది.