సింగరేణి కారుణ్య నియామకాల్లో మార్పులు

సింగరేణి కారుణ్య నియామకాల్లో మార్పులు
  • పెళ్లైన కూతుళ్లు, ఒంటరి మహిళలకు చాన్స్

మందమర్రి, వెలుగు: కారుణ్య నియామకాల్లో సింగరేణి యాజమాన్యం మార్పులు చేసింది. పెళ్లైన, విడాకులు తీసుకున్న కూతుళ్లు, ఒంటరి మహిళలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. జులైలో కంపెనీ సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన బోర్డు ఆఫ్​ డైరెక్టర్ల మీటింగ్​లోనే కారుణ్య నియామకాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి మంగళవారం డైరెక్టర్ (ఫైనాన్స్, పా) ఎన్.బలరాం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు కేవలం అవివాహిత కూతుళ్లు, కొడుకులు, చ‌ట్టపరంగా దత్తత తీసుకున్న కొడుకులకు మాత్రమే అవకాశం కల్పించారు. వాళ్లెవరూ లేకుంటే ఎంప్లాయీస్​తో ఉంటున్న, అతని జీతంపైనే ఆధార‌ప‌డిన సోద‌రుడు, వితంతువులైన కూతురు, కోడ‌లు, అల్లుడుకి కారుణ్యం కింద ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకునే చాన్స్​ ఉండేది. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ విజ్ఞప్తి మేరకు పెళ్లైన‌, విడాకులు తీసుకున్న కూతుళ్లు, ఒంట‌రి మ‌హిళ‌లకు కూడా అవ‌కాశం క‌ల్పిస్తూ ఆదేశాలిచ్చినట్లు డైరెక్టర్​ తెలిపారు. ఈ ఉత్తర్వులు 2018 మార్చి 9 తేదీ నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు.