జియో దీపావళి కబురు: కస్టమర్స్ పై బాంబ్

జియో దీపావళి కబురు: కస్టమర్స్ పై బాంబ్

ఇక ఫ్రీ డేస్ ముగిశాయి

అక్టోబరు 10 నుంచి కాల్స్ పై చార్జీల వసూలు

దీపావళికి అందరూ ఆఫర్లు ఇస్తారు. కానీ రిలయన్స్ జియో మాత్రం కస్టమర్లపై బాంబ్ పేల్చింది. ఇప్పటి వరకు ఎంజాయ్ చేస్తున్న ఫ్రీ కాల్స్ కు బ్రేక్ వేసింది. వ్యాపారంలో నష్టాలను ఇక భరించలేం అంటూ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. జియో నుంచి ఇతర నెట్ వర్క్ కు కాల్స్ మాట్లాడాలంటే డబ్బు కట్టాల్సిందేనని ప్రకటించింది.

జియో నుంచి ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, ఐడియా లాంటి ఇతర నెట్ వర్క్ ఫోన్లకు కాల్ చేయాలంటే ఇక డబ్బులు కట్టాల్సిందే. నిమిషానికి 6 పైసలు చార్జ్ చేస్తుంది జియో. ఇందుకోసం రెగ్యులర్ గా చేసుకునే రీచార్జ్ తో పాటు ప్రత్యేకంగా ఐయూసీ ప్లాన్ రీచార్జ్ చేసుకోవాలి. దాని ద్వారా వచ్చే మెయిన్ బ్యాలెన్స్ నుంచి ఈ ఆరు పైసల చార్జ్ ని వసూలు చేస్తుంది జియో.

నష్టాలు మేం భరించలేం

భారతీయులకు మాట్లాడే ఫ్రీడం ఇస్తున్నాం అంటూ గొప్పగా ప్రకటనలు చేసిన జియో ఇప్పుడు చేదు కబురు చల్లగా చెప్పింది. ఫ్రీ లాంచ్ లు, ఆఫర్లు ప్రకటించేటప్పుడు తానే తెరముందుకొచ్చిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. కస్టమర్లపై భారం వేసేప్పుడు మాత్రం ఆ సంస్థ ఉద్యోగిని ముందు పెట్టాడు. ట్రాయ్ నిబంధనల్ని వివరిస్తూ ఇప్పటికే కస్టమర్ల కోసం చాలా భారం మోసం ఇక నష్టాలు భరించలేం అంటూ ప్రకటన చేశాడా సంస్థ ప్రతినిధి. ట్రాయ్ పెట్టిన ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ నిబంధనను ప్రజలకు వివరించింది. వాస్తవానికి జియో ప్రారంభానికి ముందు నుంచే ఐయూసీ నిబంధన ఉంది. అప్పుడేమో మేమే భరిస్తామని చెప్పి.. కోట్లలో కస్టమర్లను సంపాదించుకున్నాక.. ఇప్పుడు ఆ నిబంధనను బూచీగా చూపి జనంపై బాదుడుకు దిగుతోంది.

ట్రాయ్ చెప్పిన రేటు ప్రకారం కట్టండి

‘ఈ నిబంధన ప్రకారం ఇతర నెట్ వర్క్ కు కాల్ చేసినప్పుడు ఆ సంస్థకు ఫోన్ వెళ్లిన నెట్ వర్క్ వాళ్లు డబ్బుల చెల్లించాలి. ఇలాంటి కాల్స్ పై ఇప్పటికే జియో రూ.13 వేల కోట్లు చెల్లించింది. నెలకు రూ.200 కోట్ల భారాన్ని కంపెనీ మోస్తోంది. ఈ నిబంధనను 2020 జవనవరిలో ఎత్తేస్తామని 2017 సెప్టెంబరులో ట్రాయ్ ప్రకటించింది. కానీ తాజా ఈ నిబంధనను తర్వాత కూడా కొనసాగిస్తామని చెప్పింది. కాబట్టి ఈ భారాన్ని ఇకపై జియో మోయలేదు. సో ఈ సబ్సిడీని ఇక ఇవ్వలేం. ట్రాయ్ నిర్ణయించిన ప్రకారం నిమిషానికి ఆరు పైసల చొప్పున కస్టమర్లే కట్టాలి. దీన్ని కస్టమర్ ఫోన్ చేసిన ఇతర నెట్ వర్క్ కంపెనీకే చెల్లించాలి.  అక్టోబరు 10 నుంచి ఇది అమలులోకి వస్తుంది’ అని జియో ప్రతినిధి తెలిపారు.

ఈ నిబంధనను ట్రాయ్ ఎత్తేసినప్పుడే ఇక ఫ్రీ కాల్స్ ఇవ్వగలమని చెప్పారు. ఐసీయూ ప్యాక్ కొనుగోలు చేసిన వారికి 1జీబీ డేటా అదనంగా ఇస్తామని చెప్పారు. ఇప్పటికే రీచార్జ్ లు చేసుకుని, వాటి వ్యాలిడిటీ ఉన్న వరకు ఈ నిబంధన వర్తించదన్నారు. అయితే పాత ప్లాన్స్ ముగిసి, ఆక్టోబరు 10 నుంచి రీచార్జ్ చేసుకునే ప్రతి ఒక్కరు ఇతర నెట్ వర్క్ కు కాల్ చేయాలంటే ఐయూసీ ప్లాన్ రీచార్జ్ చేసుకోవాల్సిందే. చివరిగా దీపావళి శుభాకాంక్షలు చెప్పి వీడియో సందేశాన్ని ముగించారు.  

ఇవి మాత్రమే ఫ్రీ

  • జియో నుంచి జియోకి కాల్స్
  • మొబైల్ డేటా ఉంటే వాట్సాప్, మెసేంజర్లలో చేసే వీడియో, ఆడియో కాల్స్