క్రికెట్ ఆడేందుకు లంచం: చార్మినార్ క్రికెట్ క్లబ్ సెక్రటరీపై కేసు నమోదు

క్రికెట్ ఆడేందుకు లంచం: చార్మినార్ క్రికెట్ క్లబ్ సెక్రటరీపై కేసు నమోదు

క్రికెట్ సెలక్షన్ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై చార్మినార్ క్రికెట్ క్లబ్ సెక్రటరీ మహబూబ్ అహ్మద్, అతని కుమారుడు అద్నాన్ అహ్మద్‌లపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. వన్‌డౌన్‌ ప్లేయర్‌గా చోటు దక్కించుకునేందుకు క్లబ్‌ యజమానికి రూ.లక్ష చెల్లించినట్లు ఆరోపిస్తూ ఒక ఆటగాడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

నేరేడ్‌మెట్‌కు చెందిన కె కళ్యాణ్ కుమార్ (25) అనే యువకుడు ఈ ఫిర్యాదు చేశారు. తనను తాను క్రికెటర్‌గా చెప్పుకున్న సదరు యువకుడు.. అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తన వద్ద డబ్బు తీసుకొని మోసం చేశాడని చార్మినార్ క్రికెట్ క్లబ్ సెక్రటరీ మహబూబ్ అహ్మద్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

క్రికెట్ ఆడేందుకు లంచం..

ఎంతటి ఆటగాడైనా లీగ్ మ్యాచుల్లో రాణిస్తేనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి ఎంటర్ అవ్వొచ్చు. అలా అని లీగ్ మ్యాచులు ఆడే అవకాశం అందరికీ రాదు. అదే అతన్ని చార్మినార్ క్రికెట్ క్లబ్ సెక్రటరీని కలిసేలా చేసింది. బాధిత యువకుడు ఫిర్యాదులో పొందుపరిచిన వివరాల ప్రకారం.. కళ్యాణ్ కుమార్ గతేడాది మహబూబ్ అహ్మద్‌ని కలిశారు. తనకు అవకాశాలివ్వాలని కోరగా.. అందుకు అతను రూ.1 లక్ష చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. 

అందుకు సరేనన్న సదరు యువకుడు.. మే 23, 2022న రూ.30వేలు, మే 31న మరో రూ. 45వేలు గూగుల్ పే(Google Pay) ద్వారా చెల్లించాడు. ఈ డబ్బులు నేరుగా అతని ఖాతాకు బదిలీ చేయలేదు. అతని కొడుకు స్నేహితుడి నంబర్‌కు బదిలీ చేపించుకున్నారు. అనంతరం మిగిలిన డబ్బును నేరుగా అతనికే చెల్లించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇలా అడిగినంత డబ్బు చెల్లించినప్పటికీ అతనికి అవకాశాలు ఇవ్వలేదట. కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఆడించారట. అవకాశాలు ఇవ్వనందున డబ్బు తిరిగి ఇవ్వమని అడగ్గా.. ఏడాది పాటు వేచి ఉండమని చెప్పారట. 2023-2024 సీజన్‌లో అవకాశాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారట.  చెప్పినట్టే ఏడాది పాటు వేచిఉన్నప్పటికీ అతని నుంచి స్పందన లేకపోవడంతో బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించారు.

ఐపీసీ సెక్షన్ 406, 420, 506 కింద కేసు నమోదు

ఈ ఆరోణలపై క్లబ్ యజమాని, అతడి కుమారుడిపై కేసు నమోదు చేసిన చార్మినార్ పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.