క్రూజ్‌‌‌‌ షికారు పేరుతో కుచ్చుటోపీ.. రూ.రెండు లక్షల 42 వేలు కొట్టేసిన స్కామర్లు

క్రూజ్‌‌‌‌ షికారు పేరుతో కుచ్చుటోపీ.. రూ.రెండు లక్షల 42 వేలు కొట్టేసిన స్కామర్లు

బషీర్​బాగ్, వెలుగు: విలాసవంతమైన క్రూజ్ షిష్​లో షికారు చేయాలనుకున్న ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కాడు. కొచ్చి, లక్షద్వీప్‌‌‌‌, ముంబై నగరాల మీదుగా సాగే క్రూజ్ ప్రయాణం కోసం ఆన్​లైన్​లో వెతికిన బాధితుడు.. చివరకు రూ.2,42,488 పోగొట్టుకున్నారు. కాచిగూడకు చెందిన ఓ వ్యక్తి గతేడాది డిసెంబర్ 26న గూగుల్​లో బ్రౌజ్ చేస్తుండగా కోచి, లక్షద్వీప్, ముంబై మార్గాల్లో క్రూయిజ్ ప్రయాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్న వెబ్​సైట్‌‌‌‌ను చూసి నమ్మాడు. 

నలుగురు సభ్యుల కోసం క్రూయిజ్ టూర్ బుక్ చేసుకుని మొదట రూ.23,680 అడ్వాన్స్ చెల్లించాడు. అనంతరం లక్షద్వీప్ పర్మిట్ పత్రాలు ఇస్తామని స్కామర్లు నమ్మించి ఇద్దరు పిల్లల చార్జీల పేరుతో అదనపు మొత్తాలు వసూలు చేశారు. ఆ తర్వాత సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెక్​అవుట్ సమయంలో మొత్తం తిరిగి ఇస్తామని నమ్మబలికి మరింత డబ్బు తీసుకున్నారు. తదుపరి దశలో చెల్లింపులు విఫలమయ్యాయని నమ్మబలికిన స్కామర్లు.. సరైన కారణం చెప్పకుండా బుకింగ్​ను రద్దు చేశారు. 

అనంతరం మొత్తం డబ్బు రిఫండ్ చేస్తామని చెప్పి, రద్దు చార్జీల పేరుతో మరో రూ.48,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో బాధితుడు మొత్తం రూ.2,42,488 నష్టపోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు.