మ్యాట్రిమోనీలో మాయగాళ్లు

మ్యాట్రిమోనీలో మాయగాళ్లు

వెలుగు, నెట్​వర్క్ :  జిల్లాలు, ఎల్లలు దాటి మరీ వేల జంటలను కలుపుతున్న మ్యాట్రిమోనీల్లో మాయగాళ్లు చొరబడ్తున్నారు. తమ అభిరుచులకు తగిన జోడీని వెతుక్కునే అవకాశముండడంతో పెళ్లీడు యువత, వాళ్ల తల్లిదండ్రులు ఇటీవల ఎక్కువగా మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో మోసగాళ్లకు ఆన్​లైన్​వివాహ వేదికలు అడ్డాలుగా మారాయి. ఫారిన్​లో డాక్టర్లు, ఇంజనీర్లమంటూ యువతులను నమ్మించి మోసం చేసేవాళ్లు కొందరైతే, యువతుల ఫొటోలను ఎరగా వేసి ఆడవాళ్లలా చాట్​చేస్తూ యువకుల నుంచి అందినకాడికి గుంజుతున్నవాళ్లు ఇంకొందరు. మ్యాట్రిమోనీ వెబ్​సైట్లలో అమ్మాయిల వివరాలు తీసుకొని ఫేక్​ ఫేస్​బుక్​, ఫేక్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లతో యువతులను ట్రాప్ చేస్తున్నవాళ్లు ఇంకొందరు. ఇటీవల ఈ తరహా ఘటనలు పెరుగుతుండడంతో యువతీయువకులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 

పెళ్లికూతుళ్లలా మాట్లాడి.. పైసలు కాజేసిన్రు

వరంగల్ తిలక్ రోడ్​లోని ఎల్బీ నగర్​లో శుభ్ మ్యాట్రిమోనీ పేరుతో ఓ ఆఫీసు ఓపెన్ చేశారు. మంచి సంబంధాలున్నాయంటూ కస్టమర్ల దగ్గర రూ.3వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేశారు. సంబంధాలకోసం వచ్చిన వారిని తమ దగ్గర పని చేస్తున్న యువతులను వధువులుగా నమ్మించేవాళ్లు. తర్వాత ఆ అమ్మాయిలు పెళ్లిసంబంధాల కోసం వచ్చిన యువకులకు ఫోన్లు చేసి తాము ఇబ్బందుల్లో ఉన్నామని, సాయం చేయాలని  కోరేవారు. గూగుల్​పే ద్వారా డబ్బులు దండుకున్న తర్వాత వారి నంబర్లను బ్లాక్​ చేసేవారు. ఇలా వసూలు చేసి డబ్బులను కలిసి పంచుకునేవారు. ఈ ఏజెన్సీ వల్ల దాదాపు 300 మంది పెళ్లికాని యువకులు మోసపోయారు. పలువురి ఫిర్యాదుతో  ఇంతేజార్ గంజ్ పోలీసులు జనవరి 27న  రైడ్ చేసి నిర్వాహకులైన మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన  వివేల్ కాప్రే, అనిల్ మనోహర్ ఖోవే, జితేంద్ర యశ్వంత్​తో పాటు మరో ఆరుగురు యువతులపై కేసు నమోదు చేశారు.  

డాక్టర్​ అని  చెప్పుకొని.. 

సికింద్రాబాద్​లోని బోయిన్‌పల్లికి చెందిన కవిత సాఫ్ట్​వేర్‌‌ ఎంప్లాయ్‌. ఓ మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ అప్‌లోడ్‌ చేయగా ఇది చూసిన సైబర్ నేరగాళ్లు కవితకు ఫోన్​చేసి  ప్రొఫైల్ నచ్చిందని చెప్పారు. వరుడిగా పరిచయం చేసుకున్న వ్యక్తి తాను లండన్‌లో డాక్టర్‌‌నని పదిరోజుల పాటు చాట్​చేశాడు. తాను ఇండియాకు గిఫ్ట్స్‌, గోల్డ్‌ ఆర్నమెంట్స్ తీసుకొస్తున్నట్లు చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత తనను  ఢిల్లీ ఎయిర్‌‌పోర్ట్​లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారన్నాడు. కస్టమ్స్ ఆఫీసర్ల పేరుతో ముఠా సభ్యులు కవితకు ఫోన్​ చేసి  రూ.10 లక్షలు తీసుకున్నారు.  మోసపోయినట్టు ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు పోలీసులకు కంప్లైంట్‌ చేసింది.

బిలియనీర్​గా నమ్మించి.. 

మ్యాట్రిమోనీ వెబ్​సైట్లలో యువతుల వివరాలు తీసుకుని ఫేక్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా  ట్రాప్ చేసి..  రాజమండ్రికి చెందిన జోగడ వంశీకృష్ణ  దాదాపు రూ. 2కోట్లకు పైగా కొట్టేశాడు. బాధితుల ఫిర్యాదుతో  సైబరాబాద్ పోలీసులు మే 9న అతన్ని అరెస్ట్ చేశారు.  బీటెక్​ చేసిన వంశీకృష్ణ జాబ్ కోసం సిటీకి వచ్చి కూకట్ పల్లిలో ఉంటున్నాడు.  బెట్టింగ్ లకు అలవాటు పడిన ఇతడు గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసి జైలుకెళ్లాడు. బయటకు వచ్చాక మ్యాట్రిమోనీ వెబ్​సైట్లలో డబ్బున్న యువతుల వివరాలు తీసుకుని ఫేక్ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ నుంచి  ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేవాడు. తానో కోటీశ్వరుడినని చెప్పుకుంటూ చాట్​ చేసేవాడు. అమ్మాయిల అకౌంట్లకు రూ. లక్ష నుంచి 5 లక్షల వరకు పంపి నమ్మకం కలిగించేవాడు. వారికి నమ్మకం కుదిరాక తన అకౌంట్​టెక్నికల్ ఇష్యూ వల్ల పని చేయడంలేదని చెప్పి వారి నుంచి తాను ఇచ్చిన దానికన్నా ఐదు పది రెట్లు ఎక్కువగా తీసుకునేవాడు. తర్వాత చాటింగ్ ​మానేసేవాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వంశీకృష్ణ వెయ్యికి పైగా యువతులను మోసగించాడు.  40 వరకు ఫేక్ ఇన్ స్టాగ్రామ్ ​ఐడీలతో అమ్మాయిలను చీటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.  


విదేశాల్లో జాబ్​ వస్తుందని... 


ఖమ్మంకు చెందిన వాసిరెడ్డి రాహుల్ కరీంనగర్​ జిల్లా సుల్తానాబాద్ కు చెందిన ఓ మహిళను ప్రేమ పేరుతో మోసగించి  రూ.15.50 లక్షలు,  అయిదున్నర తులాల బంగారాన్ని కాజేశాడు. ఆమె ఓ మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ పెట్టగా ఇది చూసిన రాహుల్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి చాటింగ్ మొదలు పెట్టాడు. తనకు విదేశాల్లో జాబ్​వస్తుందని నమ్మించి రూ. 6 లక్షలు .. ఆమెకు అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని  రూ. 7.5 లక్షలతో పాటు అయిదున్నర తులాల బంగారం తీసుకున్నాడు. పెళ్లి మాట ఎత్తకుండా డబ్బులు అడుగుతుండడంతో పోలీసులను ఆశ్రయించింది. చివరికి రాహుల్​ను విజయవాడలో మార్చి 4న  పట్టుకున్నారు. 

ఫేక్​ ప్రొఫైల్​ క్రియేట్ ​చేసి..

అమ్మాయి ఫొటోతో ఓ మ్యాట్రిమోనీలో  ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి వాయిస్​ చేంజ్​ యాప్​ ద్వారా కాల్స్​ చేస్తూ ఏపీలోని కాకినాడకు చెందిన సూర్యప్రకాశ్​ పలువురిని మోసం చేసి లక్షల్లో దండు కున్నాడు. దివ్యశ్రీ పేర సూర్యప్రకాశ్​ పెట్టిన ప్రొఫైల్​ నచ్చి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని శాంతినగర్ కు చెందిన సురేష్ రిక్వెస్ట్​ పంపాడు. దీంతో సూర్యప్రకాశ్​ ఓ యాప్​ ద్వారా వాయిస్​ మారుస్తూ అమ్మాయిలా, కుటుంబసభ్యుల పేరిట మాట్లాడాడు. ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకొన్నారని నమ్మబలికాడు. తండ్రి ఆరోగ్యం బాగా లేదని, ఇతర కారణాలు చెప్పి  రూ. 8లక్షలు తీసుకున్నాడు. వాట్సాప్​ కాల్​ చేయాలని  అడిగితే దాటవేస్తుండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, జూలై4న  సూర్యప్రకాశ్​ను  పోలీసులు అరెస్టు చేశారు. సూర్యప్రకాశ్​ అస్సాంకు చెందిన మరో వ్యక్తిని ఇలాగే మోసం చేసి రూ. 12 లక్షలు వసూలు చేశారని పోలీసులు చెప్పడం కొసమెరుపు.


అందమైన ఫొటోలతో బురిడీ..

జూబ్లీహిల్స్​కు చెందిన ఓ ఎన్​ఆర్​ఐ (56)  మూడేండ్ల కింద యూఎస్​ నుంచి తిరిగి వచ్చాడు. రెండో పెండ్లి కోసం ప్రొఫైల్​ను మ్యాట్రిమోనీ సైట్‌లో పెట్టాడు. దీంతో ఓ యువతి అతన్ని ఫేస్​బుక్ ​ద్వారా పరిచయం చేసుకుంది. తాను ఎరోనాటికల్ ఇంజినీరింగ్ ​చేస్తున్నానని, అతడికి భార్యగా ఉండేందుకు అభ్యంతరం లేదని చెప్పింది. అందమైన ఫొటోలు పోస్ట్ చేస్తూ ట్రాప్‌ చేసింది. ఫీజుల కోసమని రూ.15 లక్షలు, పేరెంట్స్​తో పాటు తనకు కరోనా వచ్చిందని, ఐసీయూలో ఉన్నామని  రూ.30 లక్షలు తీసుకుంది. తర్వాత ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ చేసింది. దీంతో బాధితుడు ఏప్రిల్​22న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

వాయిస్ చేంజ్‌ యాప్‌తో.. 

మ్యాట్రిమోనీ సైట్లలో యువకుల వివరాలు తీసుకుని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకుని.. ఆడపిల్లలా గొంతుమార్చి మాట్లాడుతూ అందినకాడికి దోచుకుంటున్న నూజివీడుకు చెందిన మోతె అశోక్‌(28)ను మే 11న పోలీసులు పట్టుకున్నారు. బీటెక్​ ఫైనల్ ​ఇయర్​లో చదువు మానేసిన అశోక్ ఎక్కువ టైం సోషల్‌ మీడియాలో గడిపేవాడు. 2020 ఫిబ్రవరిలో ఇందుషా తుమ్మల పేరుతో  ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్‌ ఓపెన్ చేసి.. కనిపించిన యువకుల అకౌంట్​కు ఫ్రెండ్​ రిక్వెస్ట్‌ పంపించాడు. వాయిస్ చేంజ్‌ యాప్‌ తో  ఆడపిల్లలా మాట్లాడేవాడు. ఇలా పరిచయమైన జూబ్లీహిల్స్​కు చెందిన ప్రవీణ్‌తో అమ్మాయిలా చాట్‌చేశాడు. ప్రేమిస్తున్నట్టు నమ్మించి రకరకాల కారణాలు చెప్పి రెండేండ్లలో రూ.45 లక్షలు వసూలు చేశాడు. ఈ డబ్బులతో  ఆన్ లైన్ గేమ్స్‌ఆడేవాడు. చివరికి మోసపోయానని గ్రహించిన ప్రవీణ్​ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అశోక్​ను అరెస్టు చేశారు.