మ్యాట్రిమోనీలో పెండ్లి పేరుతో వల.. రూ.70లక్షలు చీటింగ్

మ్యాట్రిమోనీలో పెండ్లి పేరుతో వల..   రూ.70లక్షలు చీటింగ్

గచ్చిబౌలి, వెలుగు: మ్యాట్రిమోనీ యాప్​లో పరిచయమైన యువతిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి, రూ.70 లక్షలు వసూలు చేసిన వ్యక్తిని సైబరాబాద్​సైబర్ క్రైమ్​పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడకు చెందిన యువతి(32) పెండ్లి కొడుకు కోసం తన వివరాలను తెలుగు మ్యాట్రిమోనీ యాప్​లో అప్లోడ్​ చేసింది. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన డి.రాజేశ్(40) కూడా తన వివరాలను మ్యాట్రిమోనీలో అప్లోడ్ చేశాడు. అలా ఒకరి ప్రొఫైల్​ను మరొకరు చూసుకున్నారు. తర్వాత ఇద్దరూ వాట్సాప్ చాటింగ్, ఫోన్​కాల్స్ చేసుకోవడం మొదలుపెట్టారు.

 కొన్నిరోజులు గడిచాక రాజేశ్​తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి, యువతి వద్ద రూ. 2 లక్షలు తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత వీసా, ఇతర కారణాలు చెప్పి మరోసారి డబ్బు అడిగాడు. అతని వలలో పడిన యువతి తెలిసిన వ్యక్తుల వద్ద, గోల్డ్​లోన్​, హోం లోన్ తీసుకుని రాజేశ్​కు రూ.52 లక్షలు ఇచ్చింది. అలాగే పర్సనల్​లోన్స్ తీసుకొని మరికొంత మొత్తం ఇచ్చింది. ఇటీవల రాజేశ్​వద్ద పెండ్లి ప్రస్తావన తీసుకురాగా, బాడీ షేమింగ్​చేయడంతోపాటు మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. చివరికి పెండ్లికి నిరాకరించాడు. దీంతో తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని బాధితురాలు రాజేష్​ను కోరగా, స్పందించలేదు. దీంతో ఆమె సైబర్ క్రైమ్​ పోలీసులను ఆశ్రయించింది. 

పెండ్లి పేరుతో రాజేశ్​తన వద్ద రూ.70లక్షలు తీసుకున్నాడని, తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా రాజేశ్​మ్యాట్రిమోనీ సైట్ లో పరిచయమైన అమ్మాయిలను పెండ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బు వసూలు చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఆ మొత్తాన్ని స్టాక్​మార్కెట్​లో, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్​మెంట్​చేసేవాడని తెలుసుకున్నారు. గాంబ్లింగ్, లగ్జరీ లైఫ్ కు అలవాటుపడిన రాజేశ్ అమ్మాయిలను మోసం చేస్తూ వస్తున్నాడని పోలీసులు తెలిపారు.