5జీకి అప్‌గ్రేడ్ అవ్వండంటూ.. మోసాలు!

5జీకి అప్‌గ్రేడ్ అవ్వండంటూ.. మోసాలు!

పెరిగిన ఫిషింగ్ ఎటాక్స్‌

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌, వెలుగు: 4జీ నుంచి 5జీ కి మారుతున్న ప్రస్తుత పరిస్థితులను సైబర్ మోసగాళ్లు  వాడుకుంటున్నారు. 5జీకి అప్‌‌గ్రేడ్ చేసుకోండంటూ మెసేజ్‌‌లు, ఈ–మెయిల్స్ పంపుతూ యూజర్లను టార్గెట్ చేస్తున్నారు.  కొన్ని సార్లు టెలికం ప్రతినిధులుగా చెప్పుకొని ఫోన్ కాల్స్ చేస్తున్నారు. 5జీ అప్‌‌గ్రెడేషన్ ప్రాసెస్ అని చెప్పి పర్సనల్ డిటెయిల్స్‌‌, ఓటీపీని సేకరిస్తున్నారు. అంతేకాకుండా మోసపూరిత లింకులను పంపి వాటిని క్లిక్ చేయమని అడుగుతున్నారు. 49 కోట్ల మంది స్మార్ట్‌‌ఫోన్ యూజర్లు ఉన్న ఇండియాలో  ఫిషింగ్  ఎటాక్స్ పెరగడం ఆశ్చర్యాన్ని కలిగించడం లేదని చెక్‌‌పాయింట్ సాఫ్ట్‌‌వేర్ ఎండీ (ఇండియా) సుందర్ బాలసుబ్రమణియన్ అన్నారు. టెల్కోలు 5జీని అమలు చేస్తుండడంతో కొత్త టెక్నాలజీకి మారాలనే ఆత్రుత యూజర్లలో పెరుగుతోందని చెప్పారు. ఈ అవకాశాన్ని సైబర్ మోసగాళ్లు వాడుకుంటున్నారని అన్నారు.    ఫ్రీగా  5జీకి అప్‌‌గ్రేడ్ చేసుకోవచ్చని చెబుతూనే, వివిధ రకాల ఆఫర్లతో యూజర్లను ఆకర్షిస్తున్నారు.  ఈ–-మెయిల్ లేదా ఎస్‌‌ఎంఎస్‌‌ల ద్వారా మాల్వేర్‌‌‌‌ను  యూజర్ల ఫోన్లకు సైబర్ మోసగాళ్లు పంపుతున్నారు. మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తూ, యూజర్ల బ్యాంక్‌‌ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. 

గతంలో ఇవి తక్కువ..

కొత్త టెక్నాలజీకి మారుతుండడంతో ఇటువంటి ఫ్రాడ్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువయ్యాయని క్లౌడ్‌‌సెక్ ఫౌండర్ రాహుల్ సాసి అన్నారు. ‘ స్మార్ట్‌‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. 3జీ నుంచి 4జీ కి మారాం. ఆ టైమ్‌‌లో ఇప్పుడున్నన్ని  యాప్‌‌లు, స్మార్ట్‌‌ఫోన్లు లేవు’ అని వివరించారు. ఓటీపీలపై ఆధారపడడం  పెరిగిపోయిందన్న ఆయన, ప్రజలు యాప్‌‌లపై ఆధారపడడం ఎక్కువయ్యిందని అన్నారు. దీంతో యూజర్లను మోసం చేయడానికి  స్కామర్లు ఈ రూట్‌‌ను  ఎంచుకుంటున్నారని వివరించారు. ‘యాప్‌‌లకు సంబంధించి కొన్ని 5జీ రిలేటెడ్‌‌ అప్‌‌గ్రేడ్స్‌‌ను కూడా వీరు ఆఫర్ చేస్తున్నారు’ అని అన్నారు. 5జీ లాంచ్ అయిన తర్వాత నుంచి మొబైల్ డివైజెస్​లపై సైబర్ దాడులు ఎక్కువయ్యాయని సోఫొస్‌‌ ఎండీ (ఇండియా) సునిల్ శర్మ పేర్కొన్నారు. 

అవగాహన పెరగాలి  .. 

సిమ్‌‌‌‌‌‌‌‌‌‌ లేదా 5జీ సంబంధిత ఆర్థిక మోసాలను తగ్గించాలంటే ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మోసాలను తగ్గించడానికి టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌‌‌‌) ఇప్పటికే జాయింట్ కమిటీ ఆఫ్ రెగ్యులేటర్స్‌‌‌‌ (జేసీఓఆర్‌‌‌‌‌‌‌‌) ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ట్రాయ్‌‌‌‌తో పాటు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ, సెబీ, కన్జూమర్స్ అఫైర్స్ మినిస్ట్రీలు మెంబర్లుగా ఉన్నాయి. ఈ సంస్థ కిందటి నెల 10 న సమావేశమయిన విషయం తెలిసిందే. కన్జూమర్లను హెచ్చరించేందుకు మరిన్ని చర్యలను కూడా ప్రభుత్వం తీసుకుంటోంది. డిపార్ట్‌‌‌‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డాట్‌‌‌‌) ఇలాంటి మోసాలకు సంబంధించి ఎప్పటికప్పుడు యూజర్లకు మెసేజ్‌‌‌‌లు పంపుతోంది. వీటికి అదనంగా వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు  టెలికం  ఫ్రాడ్స్‌‌‌‌పై అవగాహన కలిపించేందుకు  తమ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లలో సపరేట్ పేజిలను క్రియేట్ చేశాయి.   ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌, జియోలు తమ వెబ్‌‌‌‌సైట్లలో సపరేట్ పేజీలను కేటాయించకపోయినప్పటికీ   మెసేజ్‌‌‌‌ల ద్వారా ప్రజల్లో అవగాహన కలిపిస్తున్నాయి.