దొంగ సర్టిఫికెట్లతో దేశం దాటకుండా 190 ​మందికి చెక్​

దొంగ సర్టిఫికెట్లతో దేశం దాటకుండా 190 ​మందికి చెక్​
  • ఇప్పటికే పోయినోళ్లపై యాక్షన్​కు రెడీ  
  • రెండు ముఠాల అరెస్టుతో బయటపడుతున్న గుట్టు  
  • కేయూ పేరుతో తయారు చేసిన ‘పత్రాలే’  ఎక్కువ 
  • యూనివర్సిటీ, బ్యాంక్ ​ఆఫీసర్ల పాత్రపైనా ఆరా 
  • ఫేక్​ సర్టిఫికెట్స్​ వ్యవహారంలో వరంగల్​ టాస్క్​ఫోర్స్​దూకుడు 

హనుమకొండ, వెలుగు : అర్హత లేకున్నా ఫేక్​సర్టిఫికేట్లతో విదేశాలకు వెళ్లేందుకు రెడీ అయిన 190 మంది అక్రమార్కులకు వరంగల్ ​పోలీసులు చెక్ పెట్టారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న రెండు ముఠాలను ఇప్పటికే కటకటాల్లోకి పంపారు. ఎలిజిబిలిటీ లేకున్నా, లక్షలిస్తే చాలు ఫారిన్​కు పంపే బాధ్యత తమదేనని చెబుతున్న కన్సల్టెన్సీల పని పడుతున్నారు. ఉమ్మడి వరంగల్​తో పాటు హైదరాబాద్​తదితర ప్రాంతాల్లో మూడేండ్లుగా ఫేక్​సర్టిఫికెట్ల దందా సాగుతుండగా..వరంగల్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు బ్రేకులేశారు. ఈ క్రైమ్​జరగడానికి యూనివర్సిటీ ఆఫీసర్ల నిర్లక్ష్యం కూడా ఉండడంతో ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కాగా, ఫేక్​సర్టిఫికెట్లతో ఇప్పటికే విదేశాలకు వెళ్లిన వారిలో పెద్దపెద్ద లీడర్లు, ఆఫీసర్ల పిల్లలున్నట్టు సమాచారం.   
 కేయూ స్టాఫ్​ పాత్రపై ఆరా 
విదేశాల్లోని వర్సిటీల్లో హయ్యర్ ​స్టడీస్​కు లేదా పెద్దపెద్ద కంపెనీల్లో జాబ్స్​ కోసం అప్లై చేసిన తర్వాత స్టూడెంట్స్​చదివిన వర్సిటీలకు ఆయా కంపెనీలు, యూనివర్సిటీలు కన్ఫర్మేషన్​ రిక్వెస్టులు పెడుతుంటాయి. ఇలా కేయూకు కూడా చాలా రిక్వెస్టులే వచ్చాయి. కానీ, వాటి గురించి తెలుసుకుని పైఆఫీసర్లకు, పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన సిబ్బంది పట్టించుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న ‘నకిలీగాళ్లు’ కేయూ పేరుతో ఎక్కువ సర్టిఫికెట్లు రెడీ చేశారని తెలుస్తోంది. దొరికిన ఫేక్ ​సర్టిఫికెట్లలో ఎక్కువ శాతం ఈ యూనివర్సిటీవే ఉండడం ఈ ఆరోపణకు బలాన్ని చేకూరుస్తున్నది. ఇందులో  వర్సిటీ సిబ్బంది పాత్ర ఏమన్నా ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
బ్యాంకు ఆఫీసర్లున్నారా? 
ఫారిన్ ​వెళ్లే స్టూడెంట్స్​తమ బ్యాంక్​ అకౌంట్​లో మినిమం బ్యాలెన్స్​ కింద రూ. 20లక్షలు చూపించాల్సి ఉంటుంది. ఆ అమౌంట్​ కూడా దాదాపు 45 రోజుల వరకు అకౌంట్​లోనే ఉండాలి. కానీ నకిలీ సర్టిఫికెట్లతో ఫారిన్ ​వెళ్లిన వారి విషయంలో ఇదంతా జరగనట్టు తెలిసింది. దీంతో బ్యాంకు ఆఫీసర్ల పాత్రపైనా ఎంక్వైరీ చేస్తున్నారు.  
శ్రీకాంత్​రెడ్డి దొరికితే చాలు...
దొంగ సర్టిఫికెట్లతో స్టూడెంట్స్​ను విదేశాలకు పంపడంలో కొన్ని కన్సల్టెన్సీలే కీలకంగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్​, వరంగల్​లోని కొన్ని కన్సల్టెన్సీలతో లింక్​పెట్టుకుని ఫేక్​సర్టిఫికెట్లు క్రియేట్​చేసి పంపడంలో ఉమ్మడి వరంగల్ కు చెందిన ఇద్దరు కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. ఇందులో ఒకరు మహబూబాబాద్ కు చెందిన దార అరుణ్​ను డిసెంబర్​లో అరెస్ట్​ చేయగా.. వడ్డేపల్లికి చెందిన మరోవ్యక్తి శ్రీకాంత్​రెడ్డి కోసం గాలిస్తున్నారు. ఇతడు దొరికితే ఈ రెండు నగరాల్లోని ఏఏ కన్సల్టెన్సీల ద్వారా ఎంత మందిని ఫేక్​ సర్టిఫికేట్లతో విదేశాలకు పంపారో తేలే అవకాశం ఉంటుంది.  
190 మందికి బ్రేక్​
ఫేక్​ సర్టిఫికెట్లతో ఇప్పటికే వంద మందికి పైగా విదేశాలకు వెళ్లినట్లు వరంగల్ టాస్క్​ఫోర్స్​ గుర్తించింది. గత నెల పట్టుబడిన ఒక గ్యాంగ్​ 62 మందిని పంపించగా.. మూడు రోజుల కిందట అరెస్టయిన మరో గ్యాంగ్ 40 మందిని దేశం దాటించినట్లు నిర్ధారించారు. ఈ రెండు గ్యాంగుల నుంచి 252 ఫేక్​ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాల ఆధారంగా వరంగల్ టాస్క్​ఫోర్స్​అడిషనల్​డీసీపీ వైభవ్​ గైక్వాడ్​, సీఐలు సీహెచ్​.శ్రీనివాస్​, సంతోష్​ నకిలీ సర్టిఫికెట్లతో దేశం దాటాలనుకుంటున్న190 మందిని అడ్డుకున్నారు. వారి సర్టిఫికెట్ల ఆధారంగా పలు యూనివర్సిటీల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. కంప్లీట్​ఎంక్వైరీ తర్వాత వీరిపై యాక్షన్​తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.
టెన్షన్​లో పేరెంట్స్​.. స్టూడెంట్స్​
ఇప్పటికే దొంగ సర్టిఫికెట్లతో చాలామంది విదేశాలకు వెళ్లారు. ఇందులో చాలామంది పెద్దపెద్ద కంపెనీల్లో జాబ్స్​చేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం గురించి డీజీపీ ఇప్పటికే అన్ని  వర్సిటీల వీసీలతో మాట్లాడారు. ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు.  ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతుండడంతో ఫేక్ ​సర్టిఫికెట్లతో వెళ్లిన వారు తిప్పలు పడే అవకాశాలున్నాయి. ఎందుకంటే కొన్ని దేశాలు తమ దగ్గర ఫేక్​ సర్టిఫికెట్లతో ఎవరైనా చదువుతున్నారని, జాబ్స్ చేస్తున్నారని బయటపడితే కఠినంగా వ్యవహరిస్తాయి. జైలుకు కూడా పంపే అవకాశాలుంటాయి. దీంతో సదరు స్టూడెంట్స్, జాబ్​ చేసేవారి పేరెంట్స్​ ఏం జరుగుతుందోనని టెన్షన్​పడుతున్నారు. 

ఎంక్వైరీ నడుస్తోంది
ఫేక్​ సర్టిఫికెట్ల విషయంలో యూనివర్సిటీల వీసీలతో రాష్ట్ర స్థాయి మీటింగ్​జరిగింది. ఇప్పటికే వరంగల్​కమిషనరేట్ పరిధిలో కంప్లీట్ ఎంక్వైరీ చేస్తున్నాం. ఫేక్​సర్టిఫికెట్లతో వర్సిటీలు, జాబుల్లో చేరడం క్రైమ్. ఇలా చేసేవారి పేర్లను బ్లాక్​ లిస్ట్​లో పెడతాం. దీనివల్ల భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు పొందే ఛాన్స్​ఉండదు.  
–  డా.తరుణ్​ జోషి, వరంగల్ సీపీ