కేవైసీ ఉంటేనే ‘ఉపాధి’ ! జాతీయ ఉపాధి హామీ స్కీమ్‌‌లో నకిలీ హాజరుకు చెక్‌‌.. కొత్త విధానం అమల్లోకి తెచ్చిన కేంద్రం

కేవైసీ ఉంటేనే ‘ఉపాధి’ ! జాతీయ ఉపాధి హామీ స్కీమ్‌‌లో నకిలీ హాజరుకు చెక్‌‌.. కొత్త విధానం  అమల్లోకి తెచ్చిన కేంద్రం
  • పైలట్ ప్రాజెక్ట్‌‌ కింద హనుమకొండ, కరీంనగర్ జిల్లాలు ఎంపిక
  •     ఈ నెల 8 నుంచి కేవైసీ ప్రక్రియ షురూ.. 30లోగా పూర్తిచేయాలని ఆదేశాలు
  •     రాష్ట్రంలో మొత్తం 53 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులు

హైదరాబాద్, వెలుగు : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నకిలీ హాజరుకు చెక్‌‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కూలీలు తమ ఆధార్‌‌ కార్డులను జాబ్‌‌కార్డుతో లింక్ చేసుకోవాలని సూచించింది. ఈ నెల 8 నుంచి ప్రారంభమైన ప్రక్రియను  30లోగా పూర్తి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి అయితేనే అక్టోబరు 1 నుంచి ఉపాధి పని కల్పించడంతో పాటు కూలీ డబ్బులు చెల్లించనున్నారు. 
 

పైలట్‌‌ ప్రాజెక్ట్‌‌ కింద హనుమకొండ, కరీంనగర్‌‌ జిల్లాలు

ఉపాధి హామీ పథకంలో ఈ–కేవైసీ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుండగా.. తెలంగాణలోని హనుమకొండ, కరీంనగర్‌‌ జిల్లాలను పైలట్‌‌ ప్రాజెక్ట్‌‌ కింద ఎంపిక చేశారు. కేవైసీ ప్రక్రియ ఈ రెండు జిల్లాల్లో విజయవంతమైతే.. మిగతా అన్ని జిల్లాల్లో కూడా అమలు చేసేలా కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల కేవైసీ నమోదు ప్రక్రియకు సోమవారం నుంచే శ్రీకారం చుట్టారు. 

రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు మొత్తం 53 లక్షల జాబ్‌‌ కార్డులు ఉండగా.. వీటిలో 32.98 లక్షల జాబ్‌‌ కార్డులు యాక్టివ్‌‌గా ఉన్నాయి. అయితే 2023–-24 ఆర్థిక సంవత్సరంలో 1,21,422 మంది కూలీలను ఉపాధి హామీ రోల్‌‌ నుంచి తొలగించారు. ఇకపై ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలంతా తమ ఆధార్, జాబ్‌‌కార్డు వివరాలతో తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి కాని వారికి పని కల్పించే అవకాశం లేదని ఆఫీసర్లు అంటున్నారు.

నకిలీ హాజరుకు చెక్‌‌

ఉపాధి హామీ పనులకు వస్తున్న కూలీల హాజరును నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేయాలి. కానీ కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు నకిలీ ఫొటోలను, పనులకు రాకున్నా వచ్చినట్లు.. ఒకరికి బదులు మరొకరు వచ్చినా అంతా సక్రమంగానే ఉన్నట్లు యాప్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేస్తున్నట్లు గుర్తించింది. మరోవైపు సోషల్‌‌ ఆడిట్‌‌లో అక్రమాలు బయటపడటం, రికవరీలు చేయడం జరుగుతున్నా.. అక్రమాలు మాత్రం ఆగడం లేదు. వీటిని అరికట్టేందుకు కేంద్రం ఎన్ఎంఎంఎస్ యాప్ తీసుకొచ్చింది. 

దీనిని సైతం దుర్వినియోగం చేస్తున్నట్లు తేలింది. ఇతర చిత్రాలతో పాటు పని చేయకపోయినా చేసినట్లు అప్‌‌లోడ్‌‌ చేస్తున్నట్లు గుర్తించింది. దీంతో కూలీలకు ఆశించిన స్థాయిలో వేతనాలు అందడం లేదు. అందుకే ఈ–కేవైసీ ద్వారా హాజరు తీసుకునే విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. దీని ప్రకారం పనులకు వచ్చిన వెంటనే కూలీల ఫొటోలు తీసి అప్‌‌లోడ్‌‌ చేస్తారు. నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటో తీసి అప్‌‌లోడ్‌‌ చేస్తారు. 

ఒకే వ్యక్తి ఈ రెండు ఫొటోలలో ఉంటేనే కూలీ డబ్బులు వస్తాయి. లేదంటే డబ్బులను నిలిపివేస్తారు. ఈ విధానంపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేశారు. ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే నకిలీ హాజరుకు అవకాశం ఉండదని, వేతనాల చెల్లింపుల్లోనూ న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ-కేవైసీ ప్రక్రియ ఇలా..

ఉపాధి హామీ పథకం కింద జాబ్‌‌ కార్డు రెన్యూవల్‌‌, ‘ఈ– కేవైసీ’ ప్రక్రియను హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో ఈ నెల30లోపు పూర్తి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశించింది. జాబ్‌‌ కార్డ్‌‌ హోల్డర్లు ఎన్ఎంఎంఎస్‌‌ మొబైల్‌‌ యాప్‌‌, ఫేస్ యార్డీ యాప్ ద్వారా ఈ–కేవైసీ చేయించుకోవాలి. ఇంటర్నెట్ సిగ్నల్ బాగున్న ప్రదేశాన్ని ఎంచుకుని, మంచి వెలుతురు ఉన్న ప్రదేశంలో ఫొటోలు తీయాలి. ఫొటోలను మొబైల్ బ్యాక్ కెమెరాతో మాత్రమే తీయాలి. 

ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎన్ఎంఎంఎస్ మేట్‌‌లు ఈ ప్రక్రియను పర్యవేక్షించి, కూలీల కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. హనుమకొండ, కరీంనగర్ కలెక్టర్లు ఈ పైలట్ ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన సూచించారు.