‘పాలమూరు’ డీపీఆర్ పరిశీలించండి..కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్రం లేఖ

‘పాలమూరు’ డీపీఆర్ పరిశీలించండి..కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్రం లేఖ

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్​ పరిశీలన కొనసాగించాలని కేంద్ర జలశక్తి శాఖను రాష్ట్రం కోరింది. కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ పంకజ్​కుమార్​కు ఇరిగేషన్​ స్పెషల్ సీఎస్​రజత్​కుమార్​మంగళవారం ఈ మేరకు లేఖ రాశారు. డీపీఆర్​పరిశీలన కొనసాగించి త్వరగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చేలా సీడబ్ల్యూసీని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

పొలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీలకు బదులుగా ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా నికర జలాలు ఉపయోగించుకోవచ్చని బ్రజేశ్​ట్రిబ్యునల్​(జీడబ్ల్యూడీటీ) తీర్పులో స్పష్టం చేశారన్నారు. ఇందులో తెలంగాణకు 45 టీఎంసీలు దక్కుతాయని, మైనర్​ఇరిగేషన్​కేటాయింపుల్లో తాము ఉపయోగించుకోలేకపోతున్న ఇంకో 45 టీఎంసీలను కలిపి మొత్తం 90 టీఎంసీలతో ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు.

ఈ కేటాయింపులు కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్తూ సీడబ్ల్యూసీ డీపీఆర్​ను పరిశీలించకుండా వెనక్కి పంపడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 1,20‌‌0 గ్రామాలు, 12.30 లక్షల ఎకరాలకు తాగు, సాగునీటిని అందించే పాలమూరుకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. 2021 జులై 15న కేంద్రం విడుదల చేసిన కేఆర్ఎంబీ గెజిట్ ​ప్రకారం డీపీఆర్​ పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తేల్చి చెప్పారు.