పేదల కోసమే ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పేదల కోసమే ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు: పేదల కోసమే ఇందిరమ్మ కాలనీలో ఇండ్లు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద రూ.125 కోట్లతో నిర్మిస్తున్న 2160 ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..  ఇండ్ల నిర్మాణ పనులు 95 శాతం పైగా పూర్తయ్యాయని తెలిపారు.

 మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కాలనీ ఇండ్లను ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ వారం రోజుల్లో కలెక్టర్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం వెయ్యి మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి అధికారికంగా పత్రాలు అందజేస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి లబ్ధిదారులు సన్న బియ్యంతో  సహపంక్తి భోజనం చేయనున్నట్లు తెలిపారు. రాజకీయాలకతీతంగా పేదలందరికీ ఒకే చోట అన్ని వసతులతో కూడిన ఇండ్లను నిర్మించి ఇవ్వాలని 15 సంవత్సరాల ఆకాంక్ష త్వరలో నెరవేరబోతున్నట్లు తెలిపారు.

లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎలాంటి పైరవీలు లేకుండా అవినీతికి తావివ్వకుండా ఎంపిక చేయాలని ఆదేశించారు. సీఎం ప్రారంభోత్సవానికి ముందు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు, ఏఎంసీ చైర్ పర్సన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, ఆర్టికల్చర్ పీడీ నాగయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి, దొంగరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ముక్త్యాల ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాలి

మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు:  మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.  పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద నిర్మిస్తున్న ఎంబీసీ పనుల పురోగతిని గురువారం ఆయన ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.  పంప్ హౌజ్ నిర్మాణ స్థలాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..  మూడు మండలాల పరిధిలో 53 వేల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు.  19 వేల మంది రైతు కుటుంబాలకు సాగునీటి ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

రూ. 1650 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రాజెక్టు ద్వారా మఠంపల్లి మండలంలో 20,600 ఎకరాలు, మేళ్లచెరువు మండలంలో 15,890 ఎకరాలు, చింతలపాలెం మండలంలో 16,760 ఎకరాలు సాగు కానున్నాయన్నారు. 191 ఎకరాల భూసేకరణ చేసి,56 కోట్లను రైతులకు పరిహారంగా ఇచ్చామన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నియోజకవర్గం అంతా పచ్చని పంటలతో సస్యశ్యామలం అవుతుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.