నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలోని ఉత్తమ వైద్య కళాశాలగా నల్గొండ ప్రభుత్వ వైద్య కాలేజీని తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం కాలేజీలో నిర్వహించిన వార్షికోత్సవం ‘అద్వితీ–2026’కు ఆయన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్య వృత్తి అన్ని వృత్తుల కంటే పవిత్రమైనదన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం రెండు ఏసీ బస్సులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
రాబోయే రోజుల్లో నల్గొండను స్మార్ట్ సిటీగా, మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తు డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు సేవలందించాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అమీర్ ఆశ్రఫ్ అలీ, కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, వైద్యులు, విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, మేయర్ వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
