స్పెషల్ సర్వైలెన్స్ టీమ్‌‌తో కల్తీ ఆహారానికి చెక్

స్పెషల్ సర్వైలెన్స్ టీమ్‌‌తో కల్తీ ఆహారానికి చెక్
  • హైదరాబాద్‌‌లో ఆఫీస్ ఓపెన్ చేసిన టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​ మహా నగరంలో కల్తీ ఆహారాన్ని నిరోధించడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల కో ఆర్డినేషన్​తో ‘హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్'(హెచ్-ఫాస్ట్) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఆఫీసును బేగంబజార్ ఓల్డ్ పీఎస్ లో ఏర్పాటు చేయగా.. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ గురువారం ప్రారంభించారు. ఈ విభాగం ఆహార కల్తీకి వ్యతిరేకంగా పక్కా సమాచారంతో  పటిష్టమైన చర్యలు తీసుకోనున్నది. 

హెచ్-ఫాస్ట్ విభాగంలో ఇన్‌‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌‌స్పెక్టర్లు ఇతర సిబ్బందితో కలిపి మొత్తం28 మంది సభ్యులు ఉంటారు. ఆహార కల్తీకి పాల్పడే వారిని గుర్తించడం, నిఘా ఉంచడంతో పాటు దాడులు చేయనున్నారు. ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇన్‌‌స్పెక్టర్లు ఎన్ రంజిత్ కుమార్ గౌడ్, అంజయ్య, సబ్-ఇన్‌‌స్పెక్టర్లు రమ్య, అభిలాశ్, అఖిల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్..
కల్తీ ఫుడ్ గురించి సమాచారం అందించడానికి  ప్రత్యేకంగా 87126 61212  టోల్ ఫ్రీ నంబర్‌‌ను ఏర్పాటు చేశారు. ప్రజలు తమ ఫిర్యాదులను సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్స్ ద్వారా కూడా హెచ్-ఫాస్ట్  టీమ్‌‌కు పంపొచ్చు. ఆహార కల్తీ  నేరమని, దీనిని అరికట్టడంలో ఏమాత్రం ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు. కల్తీకి పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ పరిసరాల్లో జరుగుతున్న అనుమానిత ఆహార తయారీ గురించి సమాచారం అందిస్తూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.