ఐబొమ్మ చీకటి దందాకు చెక్.. ఇకపై పైరసీ చూసేవారిపైనా నిఘా – సీపీ సజ్జనార్ హెచ్చరిక.

ఐబొమ్మ చీకటి దందాకు చెక్.. ఇకపై పైరసీ చూసేవారిపైనా నిఘా – సీపీ సజ్జనార్ హెచ్చరిక.

భారతీయ చిత్ర పరిశ్రమకు పెను సవాలుగా మారిన 'ఐబొమ్మ' పైరసీ వెబ్‌సైట్ కింగ్‌పిన్, ఇమ్మడి రవి అరెస్ట్‌తో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నారు. ఏకంగా పోలీసులకే సవాల్ విసిరిన ఈ పైరసీ కింగ్‌పిన్‌ను పట్టుకోవడంలో హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులు విజయం సాధించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) వి.సి. సజ్జనార్ ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు .  సినీ పరిశ్రమకు చెందిన అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు దిల్‌రాజు, డి. సురేష్ బాబు ఈ మీడియా సమావేశంలో పాల్గొని పోలీసులకు అభినందనలు తెలిపారు.

 "దమ్ముంటే పట్టుకోండి అన్నోడు జైల్లో పడ్డాడు!"

"దమ్ముంటే పట్టుకోండి!" అని పోలీసులకే సవాల్ విసిరిన రవి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడని, ఈ పైరసీ రాకెట్‌కు అంతర్జాతీయ లింకులు ఉన్నాయని సీపీ వి.సి. సజ్జనార్ స్పష్టం చేశారు.  ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పైరసీ కార్యకలాపాల ద్వారా ఇప్పటివరకు రూ. 20 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించాడు. రవి కొత్త టెక్నాలజీని ఉపయోగించి, సినిమా విడుదలైన రోజు ఉదయమే, కొన్నిసార్లు సాయంత్రానికే హెచ్‌డీ ప్రింట్‌లను అప్‌లోడ్ చేసేవాడు. ఈ రాకెట్ ఛేదన కోసం జాతీయ సంస్థల సహాయం తీసుకుంటామని, ఈ నేరంలో పాల్గొన్న మిగతా నిందితులను కూడా త్వరలో పట్టుకుంటామని సజ్జనార్ తెలిపారు.

స్వాధీనం చేసుకున్నవి..

రవి హార్డ్ డిస్కుల్లో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌ కు చెందిన 1970ల నాటి చిత్రాల నుంచి కొత్త చిత్రాల వరకు దాదాపు 21,000 సినిమాలు లభించాయని సజ్జనార్ తెలిపారు.. రవి అమెరికా, నెదర్లాండ్స్‌ వంటి దేశాలలో సర్వర్‌లను ఏర్పాటు చేశాడు. అతని కార్యకలాపాల్లో డార్క్ వెబ్‌సైట్‌ల పాత్ర కూడా ఉన్నట్టు తేలిందని వెల్లడించారు.  రవి స్వస్థలం విశాఖపట్నం అయినప్పటికీ, మహారాష్ట్రలో 'ప్రహ్లాద్' అనే పేరుతో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లు, పాన్ కార్డులు తీసుకున్నాడు. ఐబొమ్మ కేవలం పైరసీ వెబ్‌సైట్ మాత్రమే కాదు, ఇది బెట్టింగ్ దందాకు ఒక వేదికగా మారింది. రవి తన వెబ్‌సైట్‌ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ యాప్‌లను కూడా  ( 'వన్ ఎక్స్ బెట్') భారీగా ప్రమోట్ చేశాడు. ఈ బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోగొట్టుకుని, అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు లేదా డిజిటల్ అరెస్ట్‌లు అయ్యారు. రవి నిర్వాకం వల్ల ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని సజ్జనార్ వివరించారు..

50 లక్షల మంది డేటా భద్రతకు ముప్పు

మరో ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఇమ్మడి రవి దగ్గర 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల వ్యక్తిగత డేటా ఉంది. పైరసీ సినిమాలు చూసేందుకు రిజిస్టర్ చేసుకున్న ఈ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సీపీ హెచ్చరించారు. ఈ డేటా ఎక్కడి నుంచి సేకరించబడింది, ఎవరెవరికి విక్రయించబడింది అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే రవిపై 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 3 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ తెలిపారు..

 సినీ ప్రముఖుల ప్రశంసలు

ఈ అరెస్ట్‌పై సినీ ప్రముఖులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, సినీ కార్మికుల కష్టాన్ని.. ఒక్కరూ అప్పనంగా దోచుకోవాలని చూశాడు. ఎంతో మంది కష్టాన్ని దోచుకోవడం సబబు కాదు. ఈ పైరసీ రక్కసి ప్రపంచానికే సవాలు విసురుతోంది అని రవి అరెస్ట్‌ను అభినందించారు. నిర్మాత దిల్ రాజు కూడా ఈ అరెస్ట్ పరిశ్రమకు నైతిక బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

తదుపరి చర్యలు, ప్రజలకు హెచ్చరిక

పోలీసులు ఐబొమ్మతో సహా రవి నడుపుతున్న 65 మిర్రర్ వెబ్‌సైట్‌లను మూసివేశారు. పైరసీలో సినిమాలు చూసే వాళ్లపై కూడా నిఘా పెట్టామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. తప్పు చేస్తే ఎక్కడ ఉన్నా అరెస్టు తప్పదని, పైరసీ సినిమా చూడకూడదని ప్రజలను గట్టిగా హెచ్చరించారు. ప్రస్తుతం 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న రవిని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.