
- ముగ్గురిని అరెస్ట్ చేసిన చిలకలగూడ పోలీసులు
- రూ80 లక్షల విలువ చేసే ఏడు కార్లు స్వాధీనం
పద్మారావునగర్, వెలుగు: కార్ల అద్దెల పేరిట ఓనర్లను మోసం చేస్తున్న ముగ్గరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.80 లక్షల విలువైన 7 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్‌డీసీపీ బాలస్వామి, అడిషనల్డీసీపీ జె.నర్సయ్య, ఏసీపీ శశాంక్ రెడ్డి కలిసి గురువారం చిలకలగూడ పీఎస్‌లో ఈ కేసు వివరాలు వెల్లడించారు.
నామాలగుండుకు చెందిన సంగిశెట్టి ప్రవీణ్ కుమార్, తన స్నేహితులైన కార్వాన్కు చెందిన మహ్మద్‌రిజ్వాన్, తార్నాకకు చెందిన జి. అమరేందర్ కలిసి అధిక అద్దె ఆశ చూపి ఓనర్ల నుంచి కార్లు తీసుకున్నారు. మొదట ఒకటి రెండు నెలలు అద్దె చెల్లించి నమ్మకం పొందిన తర్వాత క్రమంగా చెల్లింపులు ఆపేశారు. వాహనాలను తిరిగి ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చి డబ్బు సంపాదించేవారు.
కార్లు తన వద్ద లేవని మాయం
ఈ బాగోతంపై అంబర్‌పేటకు చెందిన బాధితుడు జ్జానేశ్వర్ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రవీణ్ కు జ్ఞానేశ్వర్‌తో పాటు అతని స్నేహితులు కలిపి మొత్తం 8 కార్లు ఇచ్చారు. కానీ తర్వాత ప్రవీణ్ అద్దె ఇవ్వకపోగా సదరు కార్లను తన స్నేహితులైన రిజ్వాన్, అమరేందర్‌కు రూ 9.10 లక్షలకు విక్రయించాడు.
యజమానులు వాహనాల అద్దె అడిగితే కార్లు తన వద్ద లేవని చెప్పి మాయమయ్యాడు. ఆ తర్వాత ప్రవీణ్‌ను పట్టుకొని పోలీసులు విచారించగా, తన నేరాన్ని అంగీకరించారు. అతడితో పాటు మిగితా ఇద్దరు రిసీవర్లను కూడా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
మొత్తం ఏడు కార్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. యజమానులు కార్లు అద్దెకు ఇచ్చే ముందు, అద్దెదారుల వివరాలు, రిజిస్ట్రేషన్ సంస్థల ప్రామాణికతను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.