వరంగల్ జిల్లాలో దారుణం: స్కూటీపై వెళ్తున్న అమ్మాయిపై కెమికల్ దాడి..

వరంగల్ జిల్లాలో దారుణం: స్కూటీపై వెళ్తున్న అమ్మాయిపై కెమికల్ దాడి..

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూటీపై వెళ్తున్న అమ్మాయిపై కెమికల్ తో దాడి చేశారు దుండగులు. హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది యువతి. మంగళవారం ( డిసెంబర్ 2 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..నర్సింగ్ కోర్స్ చదువుతున్న సునంద హన్మకొండ నుంచి వెంకటాపూర్ గ్రామానికి స్కూటీపై బయలుదేరింది. ఈ క్రమంలో కడిపికొండ గ్రామం దగ్గరకు చేరుకోగానే ఆమెపై కెమికల్ తో దాడి చేశారు దుండగులు. అకస్మాత్తుగా కెమికల్ దాడి జరగడంతో కేకలు వేసింది యువతి.

యువతి అరుపులు, కేకలు పెట్టడంతో కెమికల్ దాడికి పాల్పడ్డ దుండగులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఇది గమనించిన స్థానికులు ఆమెను కాపాడారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు.

బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు వైద్యులు. యువతి హెల్మెట్ ధరించడంతో తీవ్ర ప్రమాదం తప్పిందని స్పష్టం చేశారు వైద్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.