దంచికొట్టిన దూబే, ఊతప్ప చెన్నై బోణీ

దంచికొట్టిన దూబే, ఊతప్ప చెన్నై బోణీ

నావి ముంబై:  వరుసగా నాలుగు ఓటముల తర్వాత చెన్నై సూపర్​ కింగ్స్​ ఎట్టకేలకు తన తడాఖా చూపెట్టింది. యంగ్​స్టర్​ శివం దూబే(46 బాల్స్ లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 95 నాటౌట్), రాబిన్ ఊతప్ప (50 బాల్స్ లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 88)  ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తూ.. మూడో వికెట్​కు రికార్డు పార్ట్​నర్​షిప్​ చేసిన వేళ.. సీఎస్​కే బోణీ కొట్టింది. ఐపీఎల్​లో తమ 200వ మ్యాచ్​ను గుర్తుండిపోయేలా మార్చుకుంది. దూబే, ఊతప్ప మెరుపులకు తోడు బౌలింగ్ లో మహేశ్ తీక్షణ (4/33), జడేజా (3/39) రాణించడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో సీఎస్‌‌కే 23 రన్స్ తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. తొలుత చెన్నై 20 ఓవర్లలో 216/4 భారీ స్కోరు సాధించింది. ఆర్ సీబీ బౌలర్లలో హసరంగ (2/35) రాణంచాడు. అనంతరం ఛేజింగ్ లో బెంగళూరు ఓవర్లన్నీ ఆడి 193/9 స్కోరు చేసి ఓడిపోయింది. షాబాజ్ అహ్మద్ (27 బాల్స్ లో 4 ఫోర్లతో 41), తో పాటు దినేశ్ కార్తీక్ (14 బాల్స్ లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34) పోరాడినా ఫలితం లేకపోయింది. దూబే ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​గా నిలిచాడు. 

తీక్షణ తడాఖా.. 

భారీ టార్గెట్ ఛేజింగ్ లో  చెన్నై స్పిన్నర్‌‌ మహేశ్‌‌ తీక్షణ.. బెంగళూరును హడలెత్తించాడు.  మూడో ఓవర్లో డుప్లెసిస్ (8)ను ఔట్ చేసిన తీక్షణ.. లీగ్ లో తొలి వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే విరాట్ కోహ్లీ (1)ని ముకేశ్‌‌ చౌదరి వెనక్కుపంపగా.. అనూజ్ రావత్ (12)ను  తీక్షణ ఔట్‌‌ చేశాడు. ఉన్న  కొద్దిసేపు మెరుపులు మెరిపించిన మ్యాక్స్ వెల్ (11 బాల్స్ లో 26)ను ఏడో ఓవర్లోనే  జడేజా క్లీన్ బౌల్డ్ చేయడంతో 50/4తో  ఆర్​సీబీ కష్టాల్లో పడ్డది. ఈ దశలో షాబాజ్ అహ్మద్, ప్రభు దేశాయ్ (34) ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 11 ఓవర్లో 4, 6 బాదిన దేశాయ్ స్కోరు వంద దాటించి టీమ్‌‌ను మళ్లీ రేసులోకి తెచ్చాడు. కానీ మళ్లీ బౌలింగ్‌‌కు వచ్చిన తీక్షణ.. 13వ ఓవర్లో అతడిని బౌల్డ్ చేసి ఆర్‌‌సీబీని దెబ్బకొట్టాడు. ఓ వైపు దినేశ్ కార్తీక్ ధాటిగా ఆడుతున్నా.. మరోఎండ్ లో ఆర్‌‌సీబీ వరుసగా వికెట్లు చేజార్చుకుంది.  షాబాజ్ ను తీక్షణ, హసరంగ (7), ఆకాశ్ దీప్ (0)ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా ఆకాశ్ క్యాచ్ ను షార్ట్ కవర్ లో ఉన్న రాయుడు డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్ తో పట్టడం మ్యాచ్ కే హైలైట్. 15వ ఓవర్లో ముకేశ్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన కార్తీక్ 17వ ఓవర్లో 6,6,4 రాబట్టి మ్యాచ్ లో ఉత్కంఠకు తెరలేపాడు. కానీ బ్రావో వేసిన  18వ ఓవర్లో తను భారీ షాట్ ఆడబోయి బౌండ్రీ లైన్‌‌ దగ్గర జడేజాకు క్యాచ్‌‌ ఇవ్వడంతో చెన్నై గెలుపు ఖాయమైంది. 

తొలి పదిలో 60..చివరి పదిలో 156

టాస్‌‌ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైకి సరైన ఆరంభం లభించకపోయినా 10 ఓవర్ల తర్వాత ఊతప్ప, శివం దూబే వీరవిహారంతో భారీ స్కోరు సాధ్యమైంది. తొలుత రుతురాజ్​, ఊతప్ప  క్రీజులో కుదురుకునేందుకే ప్రాధాన్యం ఇవ్వడంతో  స్కోరు బోర్డు నెమ్మదిగా సాగింది. హేజిల్ వుడ్ వేసిన నాలుగో ఓవర్లో రుతురాజ్ (17) ఔటవగా.. పవర్ ప్లేలో 35 రన్సే వచ్చాయి.  తర్వాతి ఓవర్లోనే సుయాష్​ సూపర్​ త్రోకు మొయిన్​ అలీ (3) రనౌటయ్యాడు. సగం ఓవర్లు ముగిసే సరికి 60/2తో నిలిచిన చెన్నై 150 చేస్తే గొప్పే అనిపించింది.  కానీ, 11వ ఓవర్​ నుంచి ఊతప్ప, దూబే విధ్వంసం మొదలైంది. ఇద్దరూ గేర్​ మార్చి ఫోర్లు, సిక్సర్లే టార్గెట్​గా బ్యాటింగ్​ చేయడంతో ఇన్నింగ్స్ స్వరూపమే మారింది. హసరంగ వేసిన ఓవర్లో దూబే 6,4 కొట్టగా..  మ్యాక్సీ బౌలింగ్​లో మూడు సిక్సర్లు బాదిన ఊతప్ప టీమ్ స్కోర్ ను వంద దాటించాడు. 15వ ఓవర్లో మరో 6, 4 రాబట్టిన ఊతప్ప లీగ్ లో రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఇదే ఓవర్లో ఫోర్​తో 30 బాల్స్ లోనే దూబే కూడా ఫిఫ్టీ సాధించాడు. ఇక సిరాజ్ వేసిన 17వ ఓవర్లో 6,6,4తో జోరు చూపిన ఊతప్ప అదే ఓవర్లో క్యాచ్ ఔట్ కు వెనుదిరగాల్సి ఉన్నా అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. ఈ చాన్స్​ను సద్వినియోగం చేసుకున్న రాబిన్​తో పాటు దూబే మరింత రెచ్చిపోయారు. దీంతో వీరిద్దరి సెంచరీలపై ఆశలు చిగురించాయి. కానీ 19వ ఓవర్లో ఊతప్ప ఔట్ కావడంతో మూడో వికెట్ కు 74 బాల్స్ లోనే 165 రన్స్ పార్ట్ నర్ షిప్ ముగిసింది. జడేజా (0) విఫలమైనా చివరి ఓవర్లో దూబే రెండు సిక్సర్లతో చెన్నై ఈ సీజన్​లో అత్యధిక స్కోరు చేసింది. దూబే, ఊతప్ప దెబ్బకు ఆఖరి పది ఓవర్లలో సీఎస్​కే 156 రన్స్ రాబట్టడం విశేషం. 

చెన్నై @ 200

ఐపీఎల్ లో 200 మ్యాచ్​లు పూర్తి చేసుకున్న ఆరో జట్టుగా చెన్నై నిలిచింది. బెంగళూరుతో మ్యాచ్‌‌‌‌తో సీఎస్​కే ఈ మార్కు దాటింది. ముంబై, బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీ, పంజాబ్ 200 మ్యాచ్​ల క్లబ్​లో చేరాయి.