
అంతా సినిమా ఫక్కీలో జరిగిపోయింది. కోట్ల విలువైన వజ్రాలను దొంగల ముఠా పథకం ప్రకారం దోచుకుంది.హోటల్లో డీల్ వ్యాపారి కొంప ముంచింది. వేలుకాదు, లక్షలు కాదు.. ఏకంగా కోట్లవిలువ చేసే వజ్రాలను దోపిడి దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం దోచుకెళ్లారు. అయితే దోపిడి దొంగలు పోలీసులను తప్పించుకోలేక పోయారు. ఆదివారం (మే4) చెన్నైలో వజ్రాల వ్యాపారి నుంచి రూ. 23 కోట్ల విలువైన వజ్రాలు దొంగిలించిన దోపిడీ దొంగల ఉదంతం అంతా సినిమా స్టోరీలాగే ఉంది..వివరాల్లోకి వెళితే..
చెన్నైకి చెందిన చంద్రశేఖరన్ పురాతన ఆభరణాలు,వజ్రాలవ్యాపారి. తమిళనాడులోని అయ్యప్పంతంగల్కు జాన్ లాయిడ్(34), వలసరవక్కం కు చెందిన విజయ్ (24), తిరువెర్కాడుకు చెందిన ఆర సతీష్(28), పరమకుడికి చెందిన జి అరుణ్ పాడియా రాజన్(32) అనే నలుగురు పక్కా ప్రొఫెషనల్ దొంగలు. ఆదివారం చంద్రశేఖరన్ దగ్గర వచ్చి వజ్రాన్ని కొనుగోలు చేస్తామని అడిగారు. యూట్యూబ్ లో వీడియోలు చూసిన ఈ దోపిడి దొంగలు.. చంద్రశేఖర్ నుంచి ఎలా వజ్రాన్ని దొంగిలించాలో పక్కా ప్రణాళిక రెడీ చేసుకున్నారు. అంతకుముందు రోజు చంద్రశేఖరన్ ఇంటికి వెళ్లి వజ్రం నకిలీదా, ఒరిజినల్ అని చెకింగ్ కూడా చేసుకున్నారు.
మరుసరి రోజు అయిన ఆదివారం డీల్ కుదుర్చుకునేందుకు హోటల్ రావాలని చంద్రశేఖరన్ ను కోరారు. దీంతో చంద్రశేఖరన్ తన కూతురు జానకి, ఆమె స్నేహితురాలు సుబ్రమణి, డ్రైవర్ తో కలిసి హోటల్ కు వెళ్లారు. దాదాపు మూడు గంటల పాటు డీల్ కోసం చర్చ జరిగింది. ఈ మధ్య కాలంలో జానకి చంద్రశేఖరన్ తో ఫోన్లో కాంటాక్ట్ లో ఉంది. టోకెన్ అడ్వాన్స్ చెల్లించే క్రమంలో సుబ్రమణిని బయటికి వెళ్లమని చెప్పారు. సరిగ్గా 3గంటల తర్వాత చంద్రశేఖరన్ కాంటాక్టులో లేకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ లోకి వెళ్లింది. తీరా చూస్తే చంద్రశేఖర్ కూర్చిలో కట్టివేబడి ఉన్నాడు. ఆమె వెంటనే అప్రమత్తమై పోలీసులు ఫిర్యాదు చేసింది.
►ALSO READ | భారత్కు యుద్ధం చేసే ఆలోచన లేదు.. కానీ పాక్ రెచ్చగొడితే తొక్కిపడేస్తాం: అజిత్ దోవల్
రంగంలోకి దిగిన టీనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కుతలింగం, అసిస్టెంట్ కమిషనర్ గౌతమన్, ఇన్ స్పెక్రట్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయిన పోలీసులు నలుగురు దొంగలకోసం వేట మొదలు పెట్టారు. హోటళ్లు, ట్రాఫిక్ జంక్షన్లనుంచి సీసీ పుటేజీ సేకరించి, పరిశీలించి, సెల్ టవర్ డేటాను విశ్లేషించి దోపిడి దొంగల కదలికలను పసిగట్టారు. ఈ భారీ చోరీకి శివకాశికి చెందిన వ్యక్తి ప్రధాన సూత్రధారి అని నిర్ధారించారు. శివకాశి, ట్యూటికోరిన్ జిల్లాల్లో పోలీసులు విస్తృతంగా గాలించారు. చివరికి ఎస్పీ ఆల్బర్ట్ జాన్ నేతృత్వంలోని ట్యూటికోరిన్ పోలీసులు పూడూరులోని పాండియపురం చెక్-పోస్ట్ దగ్గర ఈ దొంగలను పట్టుకున్నారు.
యూజ్డ్ ఆటోమొబైల్ వ్యాపారం చేస్తున్న ఈ నలుగురు దొంగలు..దోపిడి చేసేముందు చంద్రశేఖరన్ పై నెలరోజులపాటు నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ఆన్ లైన్ పోర్టల్ ద్వారా వజ్రాల టెస్టింగ్ కిట్ లు, గాడ్జెట్ లు కొనుగోలు చేశారు. డీలర్ చంద్రశేఖర్ ను కలిసేందుకు ఇద్దరు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకున్నారు. అంతా ఓకే అనుకున్నాక ప్లాన్ ప్రకారం దోపిడీ చేశారని పోలీసులు చెబుతున్నారు.
మరో వైపు వ్యాపారి చంద్రశేఖరన్ కు అంత విలువైన వజ్రం ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.