సబ్ వేలో ఆగిపోయిన చెన్నై మెట్రో రైలు.. సొరంగంలో నడుచుకుంటూ వెళ్లిపోయిన జనం !

సబ్ వేలో ఆగిపోయిన చెన్నై మెట్రో రైలు.. సొరంగంలో నడుచుకుంటూ వెళ్లిపోయిన జనం !

చెన్నై: మంగళవారం ఉదయం చెన్నై మెట్రో రైలు ఎక్కిన ప్రయాణికులు భూగర్భంలో మార్నింగ్ వాక్ చేయాల్సి వచ్చింది. విమ్కో నగర్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య నడిచే చెన్నై మెట్రో రైలు బ్లూ లైన్‌లో మంగళవారం తెల్లవారుజామున సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా.. సెంట్రల్ మెట్రోకు, హైకోర్టు స్టేషన్కు మధ్య సబ్ వేలో మెట్రో రైలు ఆగిపోయింది. మెట్రో రైలులో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ఏసీలు పనిచేయలేదు.

సబ్ వేలో ఆగిపోవడం, ఏసీలు కూడా పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు. ఇక.. ఇప్పట్లో మెట్రో రైలు కదిలేలా లేదని.. ఈ మెట్రో రైలులో ఉంటే గాలి కూడా అందదని భావించిన ప్రయాణికులు.. రైలు దిగి రైల్వే ట్రాక్ మీదుగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో చెన్నై మెట్రో రైలు ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. దాదాపు పది నిమిషాల పాటు మెట్రో రైలు చిక్కుకుపోవడంతో.. 500 మీటర్ల దూరంలో ఉన్న దగ్గరలోని మెట్రో స్టేషన్ అయిన హైకోర్టు స్టేషన్‌కు ప్రయాణికులు నడిచి వెళ్లారు.

ప్రయాణికులు క్యూలో నిలబడి సొరంగం గుండా నడుచుకుంటూ వెళ్లిపోయారు. విద్యుత్తు అంతరాయంతో పాటు సాంకేతిక లోపం వల్ల ఈ అంతరాయం కలిగిందని.. మెట్రో సేవలు మళ్లీ ఎప్పటిలానే కొనసాగుతున్నాయని చెన్నై మెట్రో రైలు అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ కనిపించింది. బ్లూ లైన్‌లో విమానాశ్రయం, విమ్కో నగర్ మధ్య మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయని, పురచ్చి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ సెంట్రల్ మెట్రో నుంచి గ్రీన్ లైన్‌లో సెయింట్ థామస్ మౌంట్ వరకు కూడా సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని చెన్నై మెట్రో రైలు ‘ఎక్స్’ ఖాతాలో అధికారులు తెలిపారు.