
- 4 వికెట్ల తేడాతో సీఎస్కేపై పంజాబ్ కింగ్స్ విక్టరీ
- హ్యాట్రిక్ వికెట్లతో చహల్ మ్యాజిక్
- రాణించిన శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్
- కరన్, బ్రేవిస్ పోరాటం వృథా
చెన్నై: సొంతగడ్డపై వరుసగా ఐదు, మొత్తంగా ఎనిమిది పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అయిన చెన్నై సూపర్‌కింగ్స్.. ఐపీఎల్–18లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా నిలిచింది. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చహల్ (4/32) హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లకు తోడు బ్యాటింగ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (41 బాల్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (36 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) దంచికొట్టడంతో.. బుధవారం (ఏప్రిల్30) జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది.
టాస్ ఓడిన చెన్నై 19.2 ఓవర్లలో 190 రన్స్‌కే ఆలౌటైంది. సామ్ కరన్ (47 బాల్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 88) రాణించగా, డెవాల్డ్ బ్రేవిస్ (26 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 32) మాత్రమే అండగా నిలిచాడు. తర్వాత పంజాబ్ 19.4 ఓవర్లలో 194/6 స్కోరు చేసి గెలిచింది. శ్రేయస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
కరన్ మెరిసినా..
ముందుగా చెన్నైని పంజాబ్ బౌలర్లు కట్టడి చేసినా.. సామ్ కరన్, బ్రేవిస్ కీలక భాగస్వామ్యంతో మంచి స్కోరు అందించారు. పేసర్లు అర్ష్‌దీప్ (2/25), యాన్సెన్ (2/30) రన్స్ కట్టడి చేయడంతో ఓపెనర్లు షేక్ రషీద్ (11), ఆయుష్ మాత్రే (7) నిరాశపర్చారు. 22/2తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను కరన్ గట్టెక్కించాడు. కానీ రెండో ఎండ్‌లో జడేజా (17) మళ్లీ విఫలం కావడంతో పవర్‌ప్లేలో సీఎస్కే 48/3 స్కోరు మాత్రమే చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత కరన్, బ్రేవిస్ నాలుగు ఓవర్లలో 41 రన్స్ రాబట్టడంతో ఫస్ట్ టెన్‌లో సీఎస్కే 89/3 స్కోరు చేసింది.
ఇక్కడి నుంచి స్ట్రయిక్ రొటేట్ చేసిన ఈ జంటను 15వ ఓవర్‌లో అజ్మతుల్లా (1/39) బ్రేవిస్‌ను ఔట్ చేసి విడగొట్టాడు. నాలుగో వికెట్‌కు 78 రన్స్ జతయ్యాయి. 30 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టిన కరన్ 16వ ఓవర్‌లో 6, 6, 3 నోబాల్స్, 4, 4తో 26 రన్స్ దంచాడు. శివం దూబే (6) చివరి వరకు ఉన్నా.. 18వ ఓవర్‌లో కరన్ ఔట్‌తో ఐదో వికెట్‌కు 46 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. 19వ ఓవర్‌లో ధోనీ (11)ని వెనక్కపంపిన చహల్ చివరి మూడు బాల్స్‌కు దీపక్ హుడా (2), అన్షుల్ కాంబోజ్ (0), నూర్ అహ్మద్ (0)ను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఐపీఎల్‌లో తను హ్యాట్రిక్ సాధించడం ఇది రెండోసారి. దీంతో ఓ దశలో 184/5గా ఉన్న స్కోరు 186/9గా మారింది. చివర్లో దూబే ఫోర్ కొట్టి వెనుదిరగడంతో సీఎస్కే పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది.
శ్రేయస్, ప్రభ్ మెరుపులు
ఛేజింగ్‌లో పంజాబ్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (23), ప్రభ్‌సిమ్రన్ సింగ్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. 4.4 ఓవర్లలో 44 రన్స్ జోడించారు. వన్‌డౌన్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో పవర్‌ప్లేలో 51/1 స్కోరు చేసిన కింగ్స్ 11 ఓవర్లలో వంద రన్స్‌కు చేరింది. ఈ క్రమంలో 31 బాల్స్‌లో ఫిఫ్టీ కొట్టిన ప్రభ్‌ను 13వ ఓవర్‌లో నూర్ అహ్మద్ (1/39) పెవిలియన్‌కు పంపడంతో రెండో వికెట్‌కు 72 రన్స్ జతయ్యాయి.
ఈ దశలో బ్యాట్ ఝుళిపించిన శ్రేయస్ 32 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసినా నేహల్ వాధెరా (5) విఫలం కావడంతో స్కోరు 136/3గా మారింది. శ్రేయస్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టగా.. శశాంక్ సింగ్ (23) రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టి బౌండ్రీ లైన్ వద్ద బ్రేవిస్ అందుకున్న సూపర్ క్యాచ్‌కు ఔటయ్యాడు. చివర్లో శ్రేయస్, సుయాన్షు షెడ్జే (1) ఔటైనా.. ఇంగ్లిస్ (6 నాటౌట్) విజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 19.2 ఓవర్లలో 190 ఆలౌట్ (కరన్ 88, బ్రేవిస్ 32, చహల్ 4/32).
పంజాబ్: 19.4 ఓవర్లలో 194/6 (శ్రేయస్ 72, ప్రభ్‌సిమ్రన్ 54, ఖలీల్ 2/28).