IPL 2025: CSK జట్టులో మరో చిచ్చర పిడుగు: ఫాస్టెస్ట్ సెంచరీ హీరోని రూ.30 లక్షలకు పట్టేసిన చెన్నై

IPL 2025: CSK జట్టులో మరో చిచ్చర పిడుగు: ఫాస్టెస్ట్ సెంచరీ హీరోని రూ.30 లక్షలకు పట్టేసిన చెన్నై

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మరో యువ పవర్ హిట్టర్ చేరాడు. ఇప్పటికే ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రేవీస్ లాంటి యువ టాలెంటెడ్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోగా వారు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పుడు మరో భారత డొమెస్టిక్ పవర్ హిట్టర్ ను తన స్క్వాడ్ లోకి చేర్చుకుంది. గుజరాత్‌ వికెట్ కీపర్-బ్యాటర్ ఉర్విల్ పటేల్ ను రూ. 30 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరనున్నారు. గాయపడిన వంశ్ బేడీ స్థానంలో ఉర్విల్ పటేల్ ను తీసుకున్నట్టు సోమవారం (మే 5) CSK యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఎడమ చీలమండ గాయం కారణంగా వంశ్ బేడీ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లకు దూరం కానున్నాడు.  

ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న ఉర్విల్ పటేల్ కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. వంశ్ బేడీ రూ. 55 లక్షలకు చెన్నై జట్టులోకి  తీసుకోగా.. ఉర్విల్ పటేల్ రూ. 30 లక్షలకు CSK తమ జట్టులోకి చేర్చుకోవడం విశేషం. గుజరాత్‌కు చెందిన  వికెట్ కీపర్-బ్యాటర్ ఉర్విల్ పటేల్.. 2024 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో 28 బంతుల్లోనే త్రిపురపై సెంచరీ కొట్టి ఇండియన్ క్రికెట్ చరిత్రలోకి ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. ఇండోర్‌లోని ఎమరాల్డ్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్‌లో బుధవారం (నవంబర్ 27)త్రిపురపై అతను ఈ ఫీట్ సాధించాడు.

అంతే కాదు ఈ సెంచరీ గాలివాటం కాదని నిరూపిస్తూ 36 బంతుల్లోనే సెంచరీ చేసి ఆశ్చర్యపరిచాడు. సరిగ్గా వారం రోజులు గడవకముందే ఎమరాల్డ్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్ లో ఉర్విల్.. 36 బంతుల్లో సెంచరీ చేయడం విశేషం. పటేల్ ఓవరాల్ గా  41 బంతుల్లో 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఎలాగూ ప్లే ఆఫ్స్ ఛాన్స్ కోల్పోవడంతో ఆ జట్టు ఇప్పుడు కుర్రాళ్లను పరీక్షిస్తుంది. ఇందులో భాగంగా ఉర్విల్ పటేల్ కు ఏదో మ్యాచ్ లో ఛాన్స్ దక్కొచ్చు. చెన్నై తమ తదుపరి మ్యాచ్ ను కోల్ కతా నైట్ రైడర్స్ తో బుధవారం (మే 7) తలపడుతుంది.