IPL 2024: తొలి పంచ్ చెన్నైదే.. ఉత్కంఠ పోరులో బెంగళూరుపై విజయం

IPL 2024: తొలి పంచ్ చెన్నైదే.. ఉత్కంఠ పోరులో బెంగళూరుపై విజయం

 

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి తొలి మ్యాచ్ లో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో సొంతగడ్డపై 6 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఐపీఎల్ సీజన్ 2024 లో పాయింట్ల ఖాతా తెరిచిన తొలి జట్టుగా నిలిచింది.

174 పరుగుల లక్ష్యంతో బరిలోకి  చెన్నై సూపర్ కింగ్స్ కు బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సమర్ధవంతంగా  నిర్వర్తించారు. ఓపెనర్ రచీన్ రవీంద్ర(37) పవర్ ప్లేలో చెలరేగితే.. మిడిల్ రహానే(22), మిచెల్(27) రాణించారు. ఆ తర్వాత  జడేజా(25), దూబే(38)  హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో చెన్నై విక్టరీ కొట్టింది. 8 బంతులుండగానే చెన్నై జట్టు తమ లక్ష్యాన్ని అందుకుంది. ఆర్సీబీ బౌలర్లలో గ్రీన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. యష్ దయాళ్, కరణ్ శర్మ కు చెరో వికెట్ లభించింది. 

అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగుల స్కోర్ చేసింది. యువ బ్యాటర్ అనుజ్ రావత్ తో పాటు సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తిక్ జట్టును ఆదుకున్నారు. రావత్ 48 పరుగులతో  అదరగొడితే, కార్తీక్ (38) తనదైన స్టయిల్లో ఇన్నింగ్స్ ఫినిష్ చేశాడు. 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఈ జోడీ నిలబెట్టింది. మొదట ఆచితూచి ఆడిన వీరిద్దరూ క్రమంగా బ్యాట్ ఝళిపించి చెన్నై జట్టుకు చుక్కలు చూపించారు. వీరిద్దకు ఆరో వికెట్ కు అజేయంగా 50 బంతుల్లోనే ఏకంగా 95 పరుగులు జోడించడం విశేషం.