
ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్ లీగ్ దశలో తాము ఆడుతున్న చివరి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై 83 పరుగుల భారీ విజయాన్ని సాధించారు. ఆదివారం (మే 25) నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ లో రెచ్చిపోయిన ఆడిన చెన్నై.. ఆ తర్వాత బౌలింగ్ లో విజృంభించి గుజరాత్ కు బిగ్ షాక్ ఇచ్చింది. వరుస ఓటములతో ఢీలా పడిన సూపర్ కింగ్స్ ఓదార్పు విజయంతో ఈ సీజన్ ను ముగించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 147 పరుగులకే ఆలౌట్ అయింది.
231 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు మంచి ఆరంభం లభించలేదు. పవర్ ప్లే ముగిసేసరికి ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కాంబోజ ఖలీల్ అహ్మద్ ధాటికి 12 బంతుల వ్యవధిలోనే గిల్ (13), బట్లర్ (5), రూథర్ ఫోర్డ్ (0) వికెట్లను కోల్పోయింది.ఈ దశలో షారుఖ్, సాయి సుదర్శన్ నాలుగో వికెట్ కు 55 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. 11 ఓవర్లో షారుక్ (19) ఔట్ కావడంతో గుజరాత్ కోలుకోలేకపోయింది. ఛేజింగ్ లో పూర్తిగా తడబడి వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్, కంబోజ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. జడేజా రెండు.. ఖలీల్, పతిరానా ఒక్కో వికెట్ పడగొట్టారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. బ్రేవీస్ (23 బంతుల్లో 57: 4 ఫోర్లు, 5 సిక్సర్లు), కాన్వే (52) హాఫ్ సెంచరీకి తోడు ఆయుష్ మాత్రే (34), ఉర్విల్ పటేల్ (37) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. సాయి కిషోర్, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ ఓటమితో గుజరాత్ తమ టాప్- 2 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు చివరి మ్యాచ్ లో విజయంతో చెన్నై రాయల్ గా ఐపీఎల్ 2025కు గుడ్ బై చెప్పింది.
Chennai finish the season in style 🔥
— ESPNcricinfo (@ESPNcricinfo) May 25, 2025
🔗 https://t.co/T366RayUY4 | #IPL2025 pic.twitter.com/ZyM4QWNBeE