షాకింగ్.. ఏఐ రోబోలకు ఇంటి పనులు నేర్పిస్తున్న చెన్నై మహిళ.. గంటకు రూ.250 సంపాదన

షాకింగ్.. ఏఐ రోబోలకు ఇంటి పనులు నేర్పిస్తున్న చెన్నై మహిళ.. గంటకు రూ.250 సంపాదన

ఉదయం నిద్ర లేచింది మొదలు ఇల్లు ఊడవడం, కాఫీ పెట్టడం, బట్టలు మడతపెట్టడం, కూరగాయలు తరగటం.. ఇవన్నీ ప్రతి ఇంట్లో రోజూ జరిగే మామూలు పనులే. కానీ ఇప్పుడు ఇవే పనులు చేస్తూ కొందరు గంటకు 250 రూపాయల దాకా సంపాదిస్తున్నారు. వినడానికి భలే క్రేజీగా ఉంది కదూ. 

అవును చెన్నైకి చెందిన 25 ఏళ్ల నాగిరెడ్డి శ్రీరమ్యచంద్ర అనే మహిళ ఇప్పుడు సరిగ్గా ఇదే చేస్తోంది. తలకు ఒక అత్యాధునిక కెమెరా తగిలించుకుని, ఆమె రోజూ ఇంట్లో చేసే పనులన్నింటినీ రికార్డ్ చేస్తోంది. అయితే ఈ వీడియోలు ఏదో యూట్యూబ్ రీల్స్ కో, ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయటానికో కాదు.. భవిష్యత్తులో మన ఇళ్లలోకి రాబోయే హ్యూమనాయిడ్ రోబోలకు రోజువారీ పనుల గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి. గ్లోబల్ టెక్ కంపెనీల కోసం 'ఆబ్జెక్ట్‌వేస్' లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు భారతదేశంలో ఇలాంటి వినూత్నమైన ప్రయోగాలకు తెరలేపటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

మనం చేసే పనులను రోబోలు అచ్చుగుద్దినట్లు కాపీ కొట్టడానికి ఈ 'ఫస్ట్ పర్సన్' డేటా ఎంతో కీలకం. అందుకే చెన్నై, బెంగళూరు, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులు స్మార్ట్ గ్లాసెస్, మోషన్ సెన్సార్లు ధరించి AIకి తాము చేసే పనుల గురించి పాఠాలు నేర్పిస్తున్నారు. ఒకవైపు శ్రీరమ్యచంద్ర లాంటి వాళ్లు "ఇంట్లో పనులు చేసుకుంటే గంటకు 250 రూపాయలు ఎవరు ఇస్తారు? భవిష్యత్తులో నేనే ఒక రోబోను కొనుక్కుంటానేమో" అంటూ చాలా హ్యాపీగా ఈ పని చేస్తుంటే.. దీని వెనుక ఉన్న మరో వాస్తవం మాత్రం కాస్త భయాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే కొన్ని ప్రత్యేక స్టూడియోలలో ఆర్టిఫిషియల్ బెడ్‌రూమ్స్, కిచెన్‌లు సృష్టించి.. యువతీ యువకులతో ఒకే పనిని వందల సార్లు రికార్డ్ చేయిస్తున్నారు. ఉదాహరణకు 21 ఏళ్ల రాణి అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒకే టవల్‌ను బెడ్‌పై వేర్వేరు చోట్ల మడతపెడుతూ, రోజుకు 90 సార్లు ఒకే వీడియోను రికార్డ్ చేస్తోంది. కేవలం చేతుల కదలికలే కాకుండా, మనుషుల సహజమైన మాట తీరును రోబోలకు నేర్పించడానికి బెంగళూరులో వాయిస్ డేటాను కూడా సేకరిస్తున్నారు.

ఇదంతా చూస్తుంటే మానవుల భవిష్యత్తు ప్రయాణం ఎటు వైపు సాగుతోందో అర్థం కావడం లేదు. ప్రస్తుతం కేవలం రూ.250 కోసం మనం చాలా ఉత్సాహంగా రోబోలకు ఇళ్లల్లో, ఫ్యాక్టరీల్లో పనులు ఎలా చేయాలో నేర్పిస్తున్నాం. కానీ ఒకసారి ఈ రోబోలు పూర్తిగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని మార్కెట్లోకి వస్తే.. భవిష్యత్తులో సామాన్యులకు చిన్న చిన్న పనులు కూడా మిగిలేలా లేవు. డొమెస్టిక్ వర్కర్లు, ఫ్యాక్టరీ కార్మికుల స్థానాలను ఈ రోబోలు భర్తీ చేస్తే కోట్ల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. సాంకేతికత పెరగడం మంచిదే అయినప్పటికీ.. మనకు తెలియకుండానే మన చేతులతో మన భవిష్యత్తును ఒక లగ్జరీ రోబోటిక్ ప్రపంచంగా మారుస్తూ, మానవ శ్రమను కనుమరుగు చేసే ఒక విచిత్రమైన, భయాందోళన కలిగించే భవిష్యత్తు వైపు మానవులు అడుగులు వేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.