సుంకిశాల గోడ..క్వాలిటీ లేకనే కూలింది: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

సుంకిశాల గోడ..క్వాలిటీ లేకనే కూలింది: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • గత బీఆర్ఎస్ సర్కార్ కమీషన్లు తీసుకుని ప్రాజెక్టుల నాణ్యతను పట్టించుకోలేదు: వివేక్ వెంకటస్వామి 
  • మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పినా వినలేదు
  • రుణమాఫీ చేస్తుంటే కేటీఆర్ విమర్శలు చేస్తున్నడని ఫైర్ 
  • మిర్యాలగూడలో 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ

మిర్యాలగూడ, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్లు దోచుకుని ప్రాజెక్టుల పనుల్లో నాణ్యతను పట్టించుకోలేదని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసింది. అందులో అడ్డగోలుగా కమీషన్లు దోచుకుని, పనుల్లో నాణ్యతను పక్కనపెట్టింది. సుంకిశాల ప్రాజెక్ట్ రిటైనింగ్ వాల్ కూలిపోవడమే ఇందుకు నిదర్శనం” అని పేర్కొన్నారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘సుంకిశాల ప్రాజెక్టును మేఘా కంపెనీనే కడుతున్నది. మేడిగడ్డ కూలినప్పుడే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోరినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో తెలంగాణ ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది” అని వివేక్ అన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశారు. ఇది తట్టుకోలేని కేటీఆర్... ప్రభుత్వం వేల కోట్ల అప్పు చేసిందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్లు కమీషన్ల కోసం అప్పులు చేస్తే.. మా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నది” అని చెప్పారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. 

స్కూల్ ఏర్పాటు చేస్తం: లక్ష్మారెడ్డి 

రైస్ మిల్లర్లు, ప్రభుత్వ సహకారంతో మిర్యాలగూడలో ‘రైతన్న విద్యా నేస్తం’ పేరుతో ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. ఇందులో కేవలం రైతు కుటుంబాల పిల్లలకే అడ్మిషన్ ఇస్తామని చెప్పారు. అదే విధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సహకారంతో పట్టణంలో రూ.110 కోట్లతో ఫ్లైఓవర్లను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.490 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, జాతీయ కార్యదర్శి కోడిరెక్క శౌరి, బెజ్జం సాయి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ నాగటి జోసెఫ్ మౌర్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పని నగేశ్, నాయకులు తాళ్లపల్లి నరేశ్, బైరం జార్జి రవి, వనపట్ల శోభ, వెంకన్న, దివ్య తదితరులు పాల్గొన్నారు.

వివేక్ కు సన్మానం..

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘువీర్ రెడ్డిని మాల మహానాడు జాతీయ నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి  మాట్లాడుతూ..  ఎమ్మెల్యే వివేక్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడుతున్నారని అన్నారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు 
మరిన్ని పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.