
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చెన్నూరు SBI స్కాంను ఛేదించారు పోలీసులు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి 41 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 15 కిలోల 237 గ్రాముల బంగారంతో పాటు రూ. లక్షా 61 వేల 730 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం 44 మందిని విచారిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
నరిగె రవీందర్ అనే బ్యాంక్ క్యాషియర్ క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడి ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ లో పోగొట్టుకున్న రూ. 40 లక్షల నష్టాన్ని పూడ్చుకోవడం కోసం బ్రాంచ్ మేనేజర్ మనోహర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్ లతో కలిసి మోసానికి పాల్పడ్డట్లు నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు పోలీసులు.
10 ప్రైవేట్ గోల్డ్ లెడింగ్ కంపెనీల్లో 44 మంది పేర్లపై 142 గోల్డ్ లోన్లు తీసుకున్నారు నిందితులు. ప్రస్తుతం 15 కిలోల 237 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసుకున్న పోలీసులు మిగతా బంగారు ఆభరణాలను రికవరీ కోసం విచారణ చేస్తున్నట్లు తెలిపారు.మొత్తం రూ. 13 కోట్ల స్కాం
చెన్నూరు పట్టణంలోని ఎస్ బీ ఐ బ్యాంకులో గోల్డ్ ఫ్రాడ్ పై ఆగస్టు 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. బ్యాంకులో మొత్తంగా రూ. 12 కోట్ల 61 లక్షల విలువైన బంగారం, కోటి 10 లక్షల నగదు పోయినట్లు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో సుమారు 449 మంది కస్టమర్లు బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ లోన్లు తీసుకోగా అందులో 402 మందికిపైగా గోల్డ్ మాయమైందని ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడు బ్యాంకులో పనిచేసే క్యాషియర్ నరిగే రవీందర్ కీలకంగా వ్యవహరించారని పోలీసులు తెలిపారు.