
- కాళేశ్వరంపై కమిషన్ వెయ్యాలె..
- బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలె : వివేక్ వెంకటస్వామి
- ఉద్యమ ఆకాంక్షలను గత ప్రభుత్వం నెరవేర్చలె
- మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన్రు
- సింగరేణికి రావాల్సిన రూ.27 వేల కోట్లు చెల్లించలె
- కారుణ్య నియామకాల్లోనూ అవినీతికి పాల్పడ్డారని ఫైర్
హైదరాబాద్, వెలుగు : ఎన్నో ఆకాంక్షలతో సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయని, కానీ రాష్ట్రం వచ్చినంక ఆ ఆకాంక్షలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విమర్శించారు. గడిచిన పదేండ్లలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో పెద్ద ఎత్తున లూటీ జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని, కాళేశ్వరంపై కమిషన్ వేసి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బలపరిచిన వివేక్.. ఆ తర్వాత సభలో మాట్లాడారు.
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో కాళేశ్వరంగా మార్చి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ‘‘ఉమ్మడి ఏపీలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కోసం నా తండ్రి కాకా వెంకటస్వామి.. అప్పుడున్న మా ప్రభుత్వంపైనే కొట్లాడారు. రూ.33 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్ట్ కు పర్మిషన్ తీసుకొచ్చారు. గ్రావిటీ ద్వారా నీటిని తెచ్చే ఈ ప్రాజెక్ట్ కోసం రూ.11 వేల కోట్లను కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. కానీ కేసీఆర్ సర్కార్ వచ్చాక దీన్ని రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా మార్చేసింది. దీని కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ లక్ష కోట్లకు ఏడాదికి రూ.10 వేల కోట్ల మిత్తీ కట్టాల్సి వస్తోంది.
ప్రాజెక్టు డిజైన్‌లో ఉన్న లోపాలతో బ్యాక్ వాటర్ తన్నుకొచ్చి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మంథని, మంచిర్యాల, చెన్నూర్ తదితర ప్రాంతాల్లో దాదాపు లక్ష ఎకరాలు మునిగిపోతున్నాయి. మంచిర్యాల, మంథని పట్టణాల్లోని కాలనీలు ముంపునకు గురవుతున్నాయి” అని అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు ఎంక్వైరీ కమిషన్ వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ వస్తే ఈ ప్రాంత కాంట్రాక్టర్లకు పనులు లభిస్తాయని భావించినప్పటికీ.. ఆంధ్రా కాంట్రాక్టర్లకే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు కట్టబెట్టిందని, వారే లాభపడ్డారని అన్నారు.
సింగరేణిపై బీఆర్ఎస్ కుట్ర..
తెలంగాణ వచ్చినప్పుడు సింగరేణిలో 62 వేల మంది ఉద్యోగులు ఉండేవారని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 39 వేలకు తగ్గించిందని వివేక్ అన్నారు. ‘‘ఇంటింటికీ ఉద్యోగం ఇస్తామని చెప్పిన బీఆర్‌ఎస్.. ఒక్క సింగరేణిలోనే 23 వేల ఉద్యోగాలను తగ్గించింది. కారుణ్య నియామకాల విషయంలోనూ అవినీతికి పాల్పడింది. సింగరేణి సంస్థకు రావాల్సిన రూ.27 వేల కోట్లు చెల్లించకుండా భారీగా బకాయిలు పెట్టింది. ఆ సంస్థను నాశనం చేసేందుకు కుట్ర పన్నింది” అని ఆరోపించారు. ఈ అంశంపైనా ప్రభుత్వం విచారణ జరిపించి.. ప్రజలకు, సింగరేణి కార్మికులకు నిజానిజాలు తెలియజేయాలని కోరారు. ‘‘నా తండ్రి వెంకటస్వామి, అప్పుడు మంత్రిగా ఉన్న నా అన్న వినోద్ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఒప్పించి 1,150 మెగావాట్ల కెపాసిటీతో సింగరేణి పవర్ ప్లాంటును తీసుకొచ్చారు. ఇందులో ఇంకొక 850 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టొచ్చు. తద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడం మరింత సులువవుతుంది” అని ప్రభుత్వానికి సూచించారు.
ప్రతి శాఖలోనూ అప్పులే..
మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని వివేక్ మండిపడ్డారు. ‘‘ఒక్క విద్యుత్ శాఖ ద్వారానే రూ.81 వేల కోట్ల అప్పులు చేసిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆ సంస్థను రూ.50 వేల కోట్ల నష్టాల్లోకి నెట్టింది. సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్‌లో రూ.56 వేల కోట్ల అప్పు, రూ.11 వేల కోట్ల నష్టం ఉంది. ఇలా ప్రతి డిపార్ట్‌మెంట్‌లోనూ కార్పొరేషన్లు పెట్టి వేలు, లక్షల కోట్ల అప్పు చేశారు. తమ ఫైళ్లను క్లియర్ చేసుకోవడానికి తమకోసం పనిచేసే 300 మంది రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకుని బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడింది. ఈ అవినీతిపై విచారణ జరిపించాలి” అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ హయాంలో ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా 70 శాతం ఇండ్లకు నీళ్లు అందించామన్నారు.
‘‘బీఆర్‌ఎస్ వచ్చాక ఆర్‌డబ్ల్యూఎస్ పథకాన్ని నాశనం చేసి, మిషన్ భగీరథను తీసుకొచ్చింది. ఆ పథకం ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇస్తామని చెప్పి, రూ.60 వేల కోట్లు ఖర్చు చేసింది. కానీ, నా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా నీళ్లు రావడం లేదని జనం చెబుతున్నారు. రోడ్లు మంచిగ లేవని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దిక్కులేవని అంటున్నారు” అని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కావాలని ప్రజలు అడుగుతున్నారని, తప్పకుండా పేదలందరికీ ఇండ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
నియంతృత్వాన్ని జనం ఓడించిన్రు..
ఉద్యమ కాలం నాటి అంశాలను వివేక్ సభలో గుర్తు చేశారు. ‘‘నేను, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులం ఎంపీలుగా ఉండి పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడినం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్ వంటి వారికి అనేక ప్రజంటేషన్లు ఇచ్చినం. తెలంగాణ ఇచ్చేందుకు వారిని ఒప్పించినం. అధికార పార్టీలో ఉండి పార్లమెంటులో ఆందోళన చేసినా సోనియా మమ్మల్ని అడ్డుకోలేదు. ‘మీ ప్రాంత ప్రజల ఆకాంక్షల కోసం మీరు కొట్లాడడంలో తప్పు లేదు’ అని ప్రోత్సహించారే తప్పితే, ఎప్పుడూ కోపగించుకోలేదు” అని చెప్పారు.
‘‘బీఆర్‌ఎస్ హయాంలో అవినీతిపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి అణచివేశారు. ఆ నియంతృత్వం పోవాలనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజాస్వామిక పాలనను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అందులో భాగంగానే ప్రజావాణి కార్యక్రమం మొదలైంది” అని అన్నారు.