మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్​వాటర్​ రాకుండా కరకట్ట కట్టండి : వివేక్ వెంకటస్వామి

మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్​వాటర్​ రాకుండా కరకట్ట కట్టండి : వివేక్ వెంకటస్వామి
  • మూడు నియోజకవర్గాల సమస్యకు పరిష్కారం చూపండి
  • మంత్రి ఉత్తమ్​కు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి వినతి
  • బ్యారేజీ బ్యాక్​వాటర్​తో లక్ష ఎకరాలు మునుగుతున్నయ్​
  • మంచిర్యాల టౌన్ కూ వరద ముప్పు ఉంది
  • గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం కనీసం నష్టాన్నీ అంచనా వేయలేదు
  • రైతులకు నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత విఫల డిజైన్​ మేడిగడ్డ బ్యారేజీ అని, దాని బ్యాక్​ వాటర్​ వల్ల చెన్నూరు, మంచిర్యాల, మంథని నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆ బ్యారేజీ బ్యాక్​ వాటర్​తో మంచిర్యాల పట్టణంలోని చాలా ప్రాంతాల్లోకి వరద పోటెత్తుతున్నదని తెలిపారు. ఆదివారం ఆయన ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డితో భేటీ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్​వాటర్​ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్​వాటర్​తో సమస్య లేకుండా ఓ కరకట్టను నిర్మించేందుకు ఇరిగేషన్​ శాఖ అధికారులను ఆదేశించాలని వివేక్​ వెంకటస్వామి కోరారు. తద్వారా మూడు నియోజకవర్గాల సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, ఆ ప్రాజెక్టు తప్పుడు డిజైన్​పై గత నాలుగేండ్ల నుంచి పోరాడుతున్నట్లు పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీతో కలిగిన నష్టంపై ఆ నాటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం కనీసం అంచనాలు వేయలేదని, రైతులకు నష్టపరిహారమూ అందించలేదని వివేక్​ వెంకటస్వామి అన్నారు. బ్యారేజీలోని టెక్నికల్​ బ్లండర్​నూ సరిదిద్దలేదని, ఇవన్నీ కేసీఆర్​ వైఫల్యాలేనని పేర్కొన్నారు. 

అదో ఫెయిల్యూర్​ ప్రాజెక్ట్​

రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. ఓ విఫల ప్రాజెక్టని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీని కట్టడం వల్ల నీటిని ఎత్తిపోయట్లేదని పేర్కొన్నారు. ఒరిజినల్​ తుమ్మడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారానే నీళ్లు వస్తున్నప్పుడు.. మేడిగడ్డ నుంచి నీళ్లను వృథాగా కిందికి వదిలేయాల్సి వస్తున్నదని అన్నారు. మరోవైపు కాళేశ్వరంలో నీళ్లను పంప్​ చేయడానికి కరెంట్​ ఖర్చులూ ప్రభుత్వంపై భారీగా పడుతున్నాయని ఆయన తెలిపారు. గతంలో వరదలు వచ్చి ప్రాజెక్టులోని పంపులు, మోటార్లు మునిగిపోయాయని, ఇప్పుడేమో బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని పేర్కొన్నారు.