రేపు పంజాబ్​ రైతు కుటుంబాలకు కేసీఆర్​ చెక్కులు

రేపు పంజాబ్​ రైతు కుటుంబాలకు కేసీఆర్​ చెక్కులు
  • ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కలిసి అందివ్వనున్న సీఎం
  • 25 దాకా ఢిల్లీలోనే.. 26న బెంగళూరుకు

హైదరాబాద్ / న్యూఢిల్లీ, వెలుగు: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉద్యమం చేస్తూ చనిపోయిన పంజాబ్​ రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3 లక్షల చొప్పున చెక్కులు అందించనున్నారు. ఆదివారం ఆయన చండీగఢ్ వెళ్లి పంజాబ్ రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. తర్వాత ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్​మాన్​తో కలిసి ఒక్కో రైతు కుంటుంబానికి చెక్కులు ఇస్తారు. నాలుగు రోజుల పర్యటన కోసం కేసీఆర్ ​శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. బేగంపేట ఎయిర్​పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్​కు మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు స్వాగతం పలికారు. ఈ నెల 25 వరకు ఆయన అక్కడే ఉంటారు. దేశ ఆర్థిక పరిస్థితులపై నిపుణులతో తుగ్లక్ ​రోడ్డులోని తన నివాసంలో భేటీ కానున్నారు. దేశంలోని పరిస్థితులపై జాతీయ మీడియా ప్రతినిధులతోనూ చర్చించనున్నారు. ఢిల్లీలో టీఆర్​ఎస్​ పార్టీ భవన నిర్మాణంపైనా మంత్రి వేముల, ఎండీపీ ఇన్​ఫ్రా సంస్థ ప్రతినిధులతో భేటీ కానున్నారు. కాగా, కేసీఆర్​తో పాటు ప్లానింగ్​ బోర్డు వైస్​ చైర్మన్​ బి. వినోద్​ కుమార్​, ఎంపీలు సంతోష్​ , రంజిత్​ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​ ఢిల్లీకి వెళ్లారు. శనివారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్​ చాలీసా పారాయణం తర్వాత కవిత ఢిల్లీకి వెళ్తారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆదివారం కేసీఆర్​ చండీగఢ్​ వెళ్లనున్నారు. ఢిల్లీ, పంజాబ్​ సీఎంలు అరవింద్​ కేజ్రీవాల్​, భగవంత్​మాన్​తో కలిసి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. తర్వాత ఈ నెల 26న ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లి.. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అవుతారు. 27న మహారాష్ట్రలోని రాలేగావ్​సిద్ధిలో అన్నా హజారేతో భేటీ అవుతారు. ఈ నెల 29 లేదా 30న బెంగాల్​, బీహార్​ పర్యటనకు వెళ్తారు.  

నిపుణులతో భేటీ

జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన సీఎం కేసీఆర్​.. వివిధ రంగాలకు చెందిన నిపుణులతో భేటీ కానున్నారు. కాంగ్రెస్​, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాల ప్రాధాన్యాలు దేశాన్ని ఎలా దెబ్బతీశాయనే విషయంపై చర్చించనున్నారు. జూన్లో హైదరాబాద్​ కేంద్రంగా రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారులతో సదస్సు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్​ ప్లాన్​ చేస్తున్నారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు ప్రముఖులను ఆహ్వానించనున్నారు. కాగా, ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు కోసం కేసీఆర్​ ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్​, తమిళనాడు సీఎం స్టాలిన్​, జార్ఖండ్​ సీఎం హేమంత్​ సోరెన్​లతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల హేమంత్​ సోరెన్​, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్​లు హైదరాబాద్​లో కేసీఆర్​తో సమావేశమయ్యారు. వాటికి కొనసాగింపుగానే ఈ తాజా పర్యటన అని టీఆర్​ఎస్​ వర్గాలు 
అంటున్నాయి.