జెరూసలేం: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ జెరూసలేం మాస్టర్స్ టైటిల్ గెలుచుకున్నాడు. గురువారం జరిగిన ఫైనల్లో అర్జున్ 2.5–1.5తో ఇండియా లెజెండరీ ప్లేయర్, ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌పై నెగ్గాడు. స్టార్టింగ్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో ర్యాపిడ్ గేమ్‌లు డ్రా అయ్యాయి. కానీ బ్లిట్జ్ టైబ్రేక్‌లో తెల్లపావులతో ఆడిన అర్జున్.. ఆనంద్‌కు చెక్ పెట్టాడు. ‘గేమ్ అంత సులభంగా జరగలేదు.
చాలా సవాళ్లను ఎదుర్కొన్నా. నా ఆట అత్యుత్తమంగా లేదు. గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు ఆడిన రెండు మ్యాచ్‌లూ చాలా ఉత్కంఠగా సాగాయి. ఆనంద్ సర్‌తో జరిగిన తొలి గేమ్‌లో నేను అవకాశాలను కోల్పోయా. కానీ బ్లిట్జ్‌లో బాగా పుంజుకున్నా. గేమ్‌ను చేజార్చుకున్నప్పుడు చాలా గందరగోళానికి గురయ్యా. తర్వాత నెమ్మదిగా కోలుకున్నా’ అని మ్యాచ్ అనంతరం అర్జున్ వ్యాఖ్యానించాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో అర్జున్.. రష్యన్ గ్రాండ్ మాస్టర్ పీటర్ స్విడ్లర్‌ను ఓడించగా, ఆనంద్.. ఇయాన్ నెపోమ్నియాచిపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో ప్లేస్ కోసం జరిగిన గేమ్‌లో స్విడ్లర్ 2.5–1.5తో నెపోమ్నియాట్చిపై గెలిచాడు.
