Cheteshwar Pujara: టీమిండియా నెక్స్ట్ హెడ్ కోచ్ అతడే.. మనసులో మాట బయట పెట్టిన పుజారా

Cheteshwar Pujara: టీమిండియా నెక్స్ట్ హెడ్ కోచ్ అతడే.. మనసులో మాట బయట పెట్టిన పుజారా

ఇండియన్ క్రికెట్ లో హెడ్ కోచ్ పదవికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదే సమయంలో భారత జట్టుకు హెడ్ కోచ్ అంటే కఠిన సవాల్ తో కూడుకున్నది. గెలిస్తే ఎంతలా ప్రశంసిస్తారో.. ఓడిపోతే అంతకుమించిన విమర్శలు మోయక తప్పదు. దేశ క్రికెట్ లోనే పెద్ద పదవి అయినప్పటికీ జట్టును విజయవంతంగా నడిపించడం శక్తికి మించిన పని. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు ఆడేటప్పుడు హెడ్ కోచ్ కు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ జట్టును నడిపిస్తున్నాడు. భవిష్యత్తులో భారత జట్టును కోచ్ గా ముందుకు తీసుకువెళ్లే సత్తా ఎవరికీ ఉందో టీమిండియా వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా తెలిపాడు. 

ఫ్యూచర్ లో భారత జట్టు కోచ్ పదవికి రవిచంద్రన్ అశ్విన్ సరైన ఎంపిక కావచ్చని సీనియర్ బ్యాటర్, టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా అభిప్రాయపడ్డారు. ఈఎస్పీయన్ క్రిక్ ఇన్ఫో తో మాట్లాడుతూ.. అశ్విన్ ను హైలెట్ చేస్తూ మాట్లాడాడు. అశ్విన్ అపార జ్ఞానం, ఎప్పుడూ షార్ప్ గా ఉండే అతడి మైండ్ కోచ్ పాత్రకు సరిగ్గా సరిపోతాయని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ అశ్విన్ ఇప్పటికీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవలే జరిగిన తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దిండిగల్ డ్రాగన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి లిస్ట్ లో ఐదో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ లో టాప్-3 వికెట్ టేకర్ గా నిలిచాడు. 

ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మధ్యలో అశ్విన్ తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 14 సంవత్సరాల కెరీర్ లో 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్ లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 765 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 537, వన్డేల్లో 156 మరియు టీ20ల్లో 72 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్ గా బ్యాటింగ్‌లోనూ రాణించి మూడు ఫార్మాట్లలో 4,394 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ఐదు ఫ్రాంచైజీల తరపున ఆడిన ఈ వెటరన్ స్పిన్నర్..221 మ్యాచ్‌ల్లో  7.20 ఎకానమీ రేటుతో 187 వికెట్లు పడగొట్టాడు.

పుజారా విషయానికి వస్తే 2023 దక్షిణాఫ్రికా టూర్‌ లో టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న ఈ వెటరన్‌ బ్యాటర్లను సెలక్టర్లు తప్పించారు. 2020 నుండి పుజారా ఫామ్ దిగజారుతూ వస్తుంది. గత నాలుగేళ్లలో ఈ వెటరన్ ప్లేయర్ 28 టెస్టు మ్యాచ్ లాడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది. కేవలం ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ ను చేరుకోగలిగాడు. నిలకడగా రాణించలేకపోవడం పుజారాకు మైనస్ గా మారింది. ఇండియా తరపున 103 టెస్ట్ మ్యాచ్ లాడిన పుజారా 43 యావరేజ్ తో 7195 పరుగులు చేశాడు.