V6 News

గ్యాస్ సిలిండర్ పేలి తల్లీకూతురు మృతి

గ్యాస్ సిలిండర్ పేలి తల్లీకూతురు మృతి
  • రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన అల్లుడిపై మామ ఫిర్యాదు 

చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని నారాయణదాసుగూడలో గ్యాస్ సిలిండర్ పేలి తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు.  మేడ్చల్ జిల్లా ఘట్‌‌కేసర్ మండలం అన్నోజీగూడకు చెందిన పల్లపు వెంకటేశ్ కుమార్తె  లావణ్య (38)కు, నారాయణదాసుగూడకు చెందిన వడ్డే శ్రీనివాస్‌‌తో 2012లో వివాహమైంది. ఈ దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇంట్లో గ్యాస్ లీకై ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో లావణ్య, ఆమె కుమార్తె పావని (14) తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే లావణ్య కుమారుడు పవన్ తన తాత వెంకటేశ్‌‌కు సమాచారం అందించాడు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ తల్లీకూతురు ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె, మనవరాలి మృతిపై అల్లుడు వడ్డే శ్రీనివాస్‌‌పై తనకు అనుమానం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.