- బూటుకాలితో తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
చేవెళ్ల, వెలుగు: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా చేవెళ్లలో ట్రాఫిక్ పోలీసులు వీరంగం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ప్రభుత్వ కాలేజ్ సమీపంలో సోమవారం సాయంత్రం చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం, కానిస్టేబుల్ శ్రీను, హోంగార్డు కేశవ్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఓ కారు వెళ్తుండగా.. ఆపి డ్రైవర్ కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 90% ఆల్కాహాల్ తీసుకున్నట్టు చూపించింది. డ్రైవర్ ను అడ్రస్ చెప్పమనగా సమాధానం ఇవ్వకుండా పరుగెత్తడంతో ట్రాఫిక్ పోలీస్ వెంబడించి పట్టుకున్నారు. బండబూతులు తిడుతూ.. కొడుతూ కాలితో తన్నుతూ వీరంగం చేశారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశంను వివరణ కోరగా..- తాము ఎవరిని కొట్టలేదని చెప్పారు. డ్యూటీకి ఆటంకం కలిగించడంతోనే చేవెళ్ల పీఎస్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.