ఎలక్ట్రానిక్ మీడియాకు జవాబుదారీతనం లేదు

ఎలక్ట్రానిక్ మీడియాకు జవాబుదారీతనం లేదు

ఎల‌క్ట్రానిక్‌, సోష‌ల్ మీడియాపై చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కీలక వ్యాఖ్యలు 

రాంచీ : ఎల‌క్ట్రానిక్‌, సోష‌ల్ మీడియాపై చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియానే కోర్టుల‌ను న‌డిపిస్తోంద‌ని, కొన్ని కేసుల్లో అనుభ‌వ‌జ్ఞులైన జ‌డ్జిలు కూడా ఇవ్వలేని తీర్పుల‌ను మీడియా ఇస్తోంద‌ని చెప్పారు. అప‌రిప‌క్వ చ‌ర్చల ద్వారా ప్రజాస్వామ్య ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నార‌ని అన్నారు. దూకుడు, బాధ్యతారాహిత్యం వ‌ల్ల ప్రజాస్వామ్యాన్ని రెండు అడుగులు వెన‌క్కి తీసుకువెళ్తున్నట్లు మీడియాను ఉద్దేశించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రింట్ మీడియా ఇంకా కాస్త జవాబుదారీగా వ్యవ‌హ‌రిస్తోంద‌ని, కానీ ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం జీరో జ‌వాబుదారీత‌నంతో ఉంద‌ని ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. జార్ఖండ్‌లోని రాంచీలో జ‌రిగిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు. కొన్ని కేసులపై మీడియా సంస్థలు అవగాహన లేని ఎజెండాతో నడిపిస్తున్న చర్చల ద్వారా ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం పొంచి ఉందన్నారు.

 

 

ఇటీవ‌ల కాలంలో న్యాయ‌మూర్తుల‌పై భౌతిక‌దాడులు పెరుగుతున్నాయ‌ని, ఎటువంటి ర‌క్షణ లేకుండానే జ‌డ్జిలు స‌మాజంలో జీవించాల్సి వ‌స్తోంద‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ‌కీయ‌వేత్తలు, అధికారులు, పోలీసు ఆఫీస‌ర్లు, ప్రజాప్రతినిధుల‌కు రిటైర్మెంట్ త‌ర్వాత కూడా భద్రత క‌ల్పిస్తున్నారు. కానీ, జ‌డ్జిల‌కు ఇదే త‌ర‌హా ర‌క్షణ లేకుండా పోయింద‌ని చెప్పారు. కీలకమైన కేసుల్లో మీడియా విచార‌ణ స‌రైంది కాద‌ని తెలిపారు. బేదాభిప్రాయాల‌ను ప్రచారం చేస్తున్న మీడియా.. ప్రజ‌ల్లో వైరుధ్యాన్ని పెంచుతోంద‌ని, దీని వల్ల ప్రజాస్వామ్యం బ‌ల‌హీన‌ప‌డుతోంద‌న్నారు. సోష‌ల్ మీడియా ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంద‌ని అభిప్రాయపడ్డారు. స్వీయ నియంత్రణ‌తో మీడియా ఉండాల‌ని సూచించారు. కీలకమైన కేసుల విచారణ సందర్భంగా ఎల‌క్ట్రానిక్, సోష‌ల్ మీడియా బాధ్యత‌తో వ్యవ‌హ‌రించాల‌ని కోరారు. ప్రజ‌ల‌ను విద్యావంతుల‌ను చేసేందుకు, చైత‌న్యప‌రిచేందుకు ఎల‌క్ట్రానిక్ మీడియా త‌న గ‌ళాన్ని వాడుకోవాల‌ని చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సూచించారు.