- మూడు రోజుల పాటు అక్కడే మకాం
- నేడు ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో మీటింగ్
- ఆ తర్వాత ఖర్గే, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీతో భేటీ
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ గురువారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గవర్నర్ ఎట్ హోం ప్రోగ్రాంకు అటెండ్ అయిన రేవంత్, అక్కడి నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లి, ఢిల్లీకి పయనమయ్యారు. ఆయన 3 రోజుల పాటు అక్కడే ఉండనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం రేవంత్ తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నట్టు సమాచారం. మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. సెక్రటేరియెట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అదే రోజు ఆవిష్కరించే ఏర్పాట్లలో రేవంత్ ఉన్నారు. అనంతరం అక్కడే సభ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంకలలో ఒకరిని ఆహ్వానించే అవకాశమున్నట్టు తెలిసింది.
ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ
ఢిల్లీలో శుక్రవారం ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. రాష్ట్రంలో ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందం మేరకు ఈ భేటీ జరగనున్నది. ఆ తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో సమావేశం కానున్నారు. అనంతరం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అవుతారు. ఇటీవల 11 రోజులపాటు అమెరికా, సౌత్ కొరియాలో పర్యటించి, రికార్డు స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చిన తీరును ఆయన పార్టీ నేతలకు వివరించనున్నారు. అనంతరం మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ చీఫ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నియామకం, మిగిలిన మరో 15 నుంచి 20 వివిధ కార్పొరేషన్ చైర్మన్ల రిక్రూట్పై కూడా ఢిల్లీ పెద్దలతో రేవంత్ చర్చించనున్నారు. మూడు విడతల్లో రూ. రెండు లక్షల రైతు రుణమాఫీ పూర్తయినందున వరంగల్ లో రైతు కృతజ్ఞత సభకు రాహుల్ ను ఆహ్వానించే తేదీని ఈ భేటీలో ఖరారు చేయనున్నారు.
పీఎం, కేంద్ర మంత్రులతో భేటీ!
సీఎం హోదాలో రాష్ట్రానికి సంబంధించిన పలు సంక్షేమ పథకాల అమలు, నిధుల విడుదలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు పీఎం మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అపాయింట్ మెంట్లను ఇప్పటికే రేవంత్ కోరారు. కాగా, సీఎం ఢిల్లీ టూర్ పై పీసీసీ నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. శ్రావణ మాసంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే సంకేతాలు అందడంతో ఆశావహులు పలువురు ఈ టూర్ పై ఉత్కంఠతో ఉన్నారు. ఇటు మంత్రివర్గ విస్తరణ, అటు పీసీసీ, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్, కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై క్లారిటీ వచ్చే చాన్స్ ఉండడంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
