
రైతు బీమా తరహాలో గీత కార్మికులకు సైతం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కల్లు గీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల బీమా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సాయాన్ని నేరుగా మృతుడి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపాందించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా తరహాలోనే, కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.