TGSRTCలో తొలి మహిళా డ్రైవర్..వాంకుడోతు సరితకు సీఎం రేవంత్రెడ్డి విషెస్

TGSRTCలో తొలి మహిళా డ్రైవర్..వాంకుడోతు సరితకు సీఎం రేవంత్రెడ్డి విషెస్

ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా చేరిన వాంకుడోతు సరితకు సీఎం రేవంత్ రెడ్డి విషెష్ తెలిపారు. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని సరిత నిరూపించారని  అన్నారాయన. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరితకు సీఎం అభినందనలు తెలిపారు. 

ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో మహిళా డ్రైవర్ నియామకం ఓ కీలక ముందడుగు అన్నారు సీఎం. మహిళలు విద్య, విజ్ఞానం, వృత్తి, వ్యాపారం, క్రీడలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారాయన. 

గృహ బాధ్యతలతోపాటు సమాజ నిర్మాణంలోనూ మహిళల పాత్ర అపూర్వమైందన్నారు సీఎం.ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించి మహిళలు విజయాల బాటలో ముందుకెళ్తున్నారని..సరిత అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు.

ఇందిరా మహిళా శక్తి పథకంతో రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు సీఎం. కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యసాధన కోసం ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.