
- వారంలో అధికారులు, నిపుణులతో ఏర్పాటు
- జలశక్తి శాఖ సమక్షంలో తెలంగాణ, ఏపీ సీఎంల నిర్ణయం
- శ్రీశైలం ప్రాజెక్ట్ రిపేర్లకు ఏపీ ఓకే
- కృష్ణాలో అన్ని పాయింట్ల వద్ద టెలిమెట్రీలు యంత్రాలు
- తెలంగాణలో గోదావరి బోర్డు, ఏపీలో కృష్ట్రాబోర్డు ఆఫీసుల ఏర్పాటు
- తెలంగాణ డిమాండ్లకు ఏపీ అంగీకరించింది: సీఎం రేవంత్‌రెడ్డి
- బనకచర్లపై ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడి
- రాష్ట్ర హక్కుల కోసం లడాయికైనా సిద్ధమని ప్రకటన
- ఇరు రాష్ట్రాలు గొడవ పడాలని కొందరు చూస్తున్నరని విమర్శ
న్యూఢిల్లీ, వెలుగు: జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, సాంకేతికనిపుణులతో కమిటీ వేయాలని తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు నిర్ణయించారు. వారం రోజుల్లో ఈ కమిటీ ఏర్పాటు కానుంది. రెండు రాష్ట్రాల నడుమ గోదావరి, కృష్ణా జలాల పంపిణీ సమస్యలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై అభ్యంతరాలు, ఇతర సాంకేతిక సమస్యలపై కమిటీ చర్చించి నివేదిక ఇవ్వనుంది.
ఆ తర్వాత మరోసారి సీఎంల స్థాయిలో చర్చలు జరిపి, ఆయా సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఆఫీసులో ఆ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై దాదాపు గంటపాటు చర్చించారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు, మంత్రి ఉత్తమ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కృష్ణా, గోదావరి జలాల సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణం, పాత ప్రాజెక్టులకు అనుమతులు, నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరాలు.. ఇవన్నీ 30 రోజుల్లో కమిటీ గుర్తించి, వాటన్నింటినీ చర్చకు తీసుకొస్తుందని చెప్పారు. తమ డిమాండ్ మేరకు కృష్ణా ప్రాజెక్టులపై టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు ఏపీ ఒప్పుకుందని, అదేవిధంగా శ్రీశైలం రిజర్వాయర్ రిపేర్లకు కూడా అంగీకరించిందని తెలిపారు.
ఇలా భేటీలో తీసుకున్న నిర్ణయాలన్నీ తెలంగాణ విజయమేని ఆయన అన్నారు. ‘‘కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ అభ్యంతరాలకు ఏపీ వెనక్కి తగ్గి ఒప్పుకుంది. ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం. ఇరు రాష్ట్రాలు గొడవలు పెట్టుకోవాలని కొందరు చూస్తున్నరు. కానీ, వివాదాలు లేకుండా సమస్యలను పరిష్కరించుకోవడమే మా ఎజెండా. మేం తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నం. తెలంగాణ హక్కుల కోసం వెనక్కి తగ్గబోం. అవసరమైతే లడాయికైనా సిద్ధమే’’ అని సీఎం తేల్చిచెప్పారు.
బనకచర్లపై చర్చ లేదు
బనకచర్ల కడ్తామన్న ప్రతిపాదన సమావేశంలో చర్చకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘గోదావరి–--బనకచర్ల కడ్తమని వాళ్లు అడిగితేనే కదా మేం ఆపాలని చెప్పేది. ఆ అంశమే చర్చకు రానప్పుడు ఆపాలని ఎట్ల అంటం. బనకచర్లపై ఇప్పటికే మేం ఫిర్యాదులు చేశాం. దానిపై పోలవరం అథారిటీ, సీడబ్ల్యూసీ, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డులు మా ఫిర్యాదులకు స్పందించాయి.
ఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెప్పాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించి అభ్యంతరాలను లేవనెత్తాయి. కాబట్టి.. ఈ సమావేశంలో బనకచర్లకు సంబంధించిన అంశాలేవీ ప్రస్తావనకు రాలేదు” అని ఆయన వివరించారు. కేవలం కృష్ణా నదీ బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నెన్ని నీళ్లను వినియోగిస్తున్నాయనే దానిపై టెలిమెట్రీ పెట్టాలనే నిర్ణయం జరిగిందన్నారు. దీనివల్ల నీటి వినియోగానికి సంబంధించిన సమస్యకు శాస్వత పరిష్కారం లభించినట్లవుతుందని పేర్కొన్నారు. ‘‘శ్రీశైలం ప్రాజెక్టు డామేజ్అయింది.
దీనికి తక్షణమే మరమ్మతు చేయాలని ఎన్డీఎస్ఏ సహా మిగిలిన సంస్థలు నివేదికలు ఇచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే కాబట్టి.. మరమ్మతుకు ఏపీ అంగీకారం తెలిపింది. గోదావరి, కృష్ణా నది యాజమాన్య బోర్డులు చెరొక రాష్ట్రంలో ఉండాలని పునర్విభజన చట్టంలో, 2020 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం జరిగింది.
దీనిప్రకారం.. గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ లో ఉండేందుకు అంగీకారం కుదిరింది. గోదావరి, కృష్ణా నదులతోపాటు వాటి పరిధిలోని ఉప నదుల పరిధిలోని నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదించిన ప్రాజెక్టులు, ప్రస్తుత ప్రాజెక్టుల నిర్వహణ అన్నింటిపైనా నిపుణుల కమిటీ ముందు చర్చకు వస్తాయి. ఆ తర్వాత ప్రతిపాదనలు వస్తాయి’’ అని ఆయన వెల్లడించారు.
యుద్ధప్రాతిపదికన టెలిమెట్రీల ఏర్పాటు: మంత్రి ఉత్తమ్
కృష్ణా జలాల లెక్కలో రెండు రాష్ట్రాలకు అనుమానాలున్నాయని, ఈ నీళ్ల విషయంలో టెలిమెట్రీల ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ‘‘టెలిమెట్రీ పరికరాలు ఉపయోగిస్తే.. ఎవరు ఎన్ని నీళ్లు వాడుతున్నరో తెలుస్తుంది. పదేండ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఈ అంశాన్ని ఏనాడూ బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఈ విషయంలో మా ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వీటి ఏర్పాటుకోసం అవసరమైతే కేంద్రం, ఏపీ ప్రభుత్వ వాటాను కూడా చెల్లించేందుకు సిద్ధమైందని గత సమావేశంలోనే కేంద్ర మంత్రికి చెప్పాం” అని వివరించారు.
అన్ని పాయింట్లలో టెలిమెట్రీ పరికరాలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చెయ్యాలని సీఎంల భేటీలో నిర్ణయం జరిగిందని ఆయన వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యాం విషయంలో కొన్ని అంశాలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన శ్రీశైలం డ్యాం రిపేర్లు చెయ్యాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కృష్ణా, గోదావరి జలాల వివాదాలకు సంబంధించి రెండు రాష్ట్రాల నుంచి సీనియర్ అధికారులు, నిపుణులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందన్నారు. మీడియా సమావేశంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య, సురేశ్
షెట్కార్, బలరాం నాయక్, రఘురాంరెడ్డి, రఘువీర్‌రెడ్డి, అభిషేక్ మనుసింఘ్వీ పాల్గొన్నారు.
సమావేశంలో గోదావరి-బనకచర్ల కడ్తమని వాళ్లు అడిగితేనే కదా
మేం ఆపాలని చెప్పేది. ఆ అంశమే చర్చకు రానప్పుడు ఆపాలని ఎట్ల అంటం. బనకచర్లపై ఇప్పటికే మేం ఫిర్యాదులు చేశాం. పోలవరం అథారిటీ, సీడబ్ల్యూసీ, గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డులు మా ఫిర్యాదులకు స్పందించాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ సంస్థలే ప్రాజెక్టుపై అభ్యంతరాలను లేవనెత్తాయి. కాబట్టి, ఈ సమావేశంలో బనకచర్లకు సంబంధించిన అంశాలేవీ ప్రస్తావనకు రాలేదు. సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ హక్కులను ధారాదత్తం చేసిందే కేసీఆర్
తెలంగాణ హక్కులను ఆంధ్రాకు ధారాదత్తం చేసిందే కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘తన నిర్ణయాతో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిండు. వాటిని పరిష్కరించడానికే మేం విధివిధానాలను రూపొందించాం. 2020 లో అప్పటి సీఎంలు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్లో సంతకాలు పెట్టారు. ఆ ప్రతిపాదనలు ఎటుపోయినయ్? వాటిపై ఎవరూ మాట్లాడరు. కానీ ఇప్పుడు మేం పరిష్కరిస్తుంటే.. కొందరు భరించలేకపోతున్నరు.
సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఉన్నాం కానీ, జటిలం చేసుకునేందుకు కాదు” అని ఆయన అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు జరిగితే బాగుండన్న ఆలోచనలో కొందరు ఉన్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ నేతలకు పదేండ్లు ప్రజలు అవకాశం ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి వాళ్లు చేసిందేమీ లేదు. వాళ్ల రాజకీయ బాధను మేం అర్థం చేసుకోగలం.
అధికారం పోయిన దు:ఖంలో వాళ్లు ఏవేవో చేస్తనే ఉంటరు. మేం వాళ్లకు సమాధానం ఇవ్వడానికి లేం. తెలంగాణ ప్రజల కోసం ఉన్నం. పరిపాలన ఎలా చేయాలో తెలుసు.. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మాకు అవగాహన ఉంది” అని ఆయన అన్నారు. వివాదాలు చెల రేగకుండా, శాశ్వత పరిష్కారం చూపడమే తమ బాధ్యత అని ఆయన తెలిపారు.
అవసరమైతే లడాయికి సిద్ధం
ఇది ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ అని, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశం మాత్రమే. కేంద్ర జలశక్తి శాఖ కేవలం ఆర్గనైజ్ చేసింది. జలశక్తి శాఖ ఎలాంటి ఎజెండాను నిర్ణయించలేదు. అయితే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఇప్పటికే ఎజెండా అంశాలను జలశక్తి శాఖ ముందు పెట్టాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
ఈ సమయంలో లడాయి చేసే అంశం ఎక్కడి నుంచి వస్తుంది. ఒక వేల ఈ చర్చలతో పరిష్కారం దొరకకపోతే.. అప్పుడు పోరాటం గురించి ఆలోచిస్తం. సడక్ నుంచి సంసద్ వరకు అన్ని తయారు చేసుకొని ఉన్నం. తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తం. లడాయికైనా సిద్ధం” అని ఆయన స్పష్టం చేశారు. తాజా సీఎంల భేటీ ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న జల వివాదాల కోసం మాత్రమేనని తెలిపారు.
నుమానించు కుంటే పోతే ఏ సమస్యా పరిష్కారం కాదన్నారు. ఏపీ విభజనపై పార్లమెంట్ లో చట్టం జరిగినా.. ప్రధాని మోదీ ఒప్పుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.