క్యాసినో, హవాలా కేసులో చీకోటి ప్రవీణ్‌కు ప్రశ్నల వర్షం

క్యాసినో, హవాలా కేసులో చీకోటి ప్రవీణ్‌కు ప్రశ్నల వర్షం
  • టోకెన్లు క్యాష్‌‌గా ఎలా మారాయి?
  • క్యాసినో టోకెన్స్, హవాలా పైసలపై ఈడీ నజర్
  • మూడో రోజు విచారణలో కీలక వివరాలు రాబట్టిన ఆఫీసర్లు
  • ప్రవీణ్‌‌ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌‌లో ఫారిన్ అకౌంట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: క్యాసినో, హవాలా కేసులో చీకోటి ప్రవీణ్‌‌ మూడో రోజు ఈడీ ముందు హాజరయ్యారు. బషీర్‌‌‌‌బాగ్‌‌లోని ఈడీ ఆఫీస్‌‌కి బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన హాజరయ్యారు. సోమవారం జరిపిన విచారణకు కొనసాగింపుగా ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈ విచారణలో ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. క్యాసినో టోకెన్లను క్యాష్‌‌ చేసుకోవడం లాంటి వివరాలను రికార్డ్ చేసినట్లు సమాచారం. ఏపీ,తెలంగాణలోని రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారులు, ఫైనాన్షియర్ల వద్ద చీకోటి రూ.కోట్లలో తీసుకున్నారని తెలిసింది. ఇలా కలెక్ట్‌‌ చేసిన డబ్బును క్యాసినో, హవాలాలో మళ్లించారని ఈడీ ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే చీకోటితో పాటు మాధవరెడ్డి, సంపత్‌‌ అకౌంట్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అనుమానిత ట్రాన్సాక్షన్స్‌‌ వివరాలతో స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌ చేసినట్లు తెలిసింది. అలాగే వీదేశీ బ్యాంక్​ ట్రాన్సాక్షన్స్‌‌, వాటిలో గత నాలుగేండ్లుగా జరిగిన లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలని నిందితులను ఆదేశించినట్లు సమాచారం. 

సైబర్ క్రైమ్ పోలీసులకు చీకోటి ఫిర్యాదు
ఈడీ ఆఫీస్‌‌లో విచారణకు హాజరయ్యే ముందు చీకోటి ప్రవీణ్‌‌ సైబర్‌‌‌‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుతో సోషల్‌‌ మీడియాలో ఫేక్‌‌ అకౌంట్లు క్రియేట్‌‌ చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఏసీపీ కేవీఎం ప్రసాద్‌‌కి అందజేశారు. ఏపీ సీఎంతో తనకు ఎలాంటి  సంబంధాలు లేవని ఆయన చెప్పారు. జగన్‌‌తో తనకు లింక్ పెట్టి, పోస్టింగ్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. తనను అడ్డం పెట్టుకుని నీచపు రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఏపీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.