చీకోటి ప్రవీణ్ ఎవరికీ భయపడడు

చీకోటి ప్రవీణ్ ఎవరికీ భయపడడు

నాపై పనిగట్టుకుని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు.. ఎవరినీ వదిలి పెట్టనని చీకోటీ ప్రవీణ్ తెలిపారు. క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటీ ప్రవీణ్ కుమార్ పై ఇవాళ ఈడీ విచారణ నాలుగో రోజు ముగిసింది. అనంతరం మీడియాతో చికోటీ మాట్లాడుతూ.. విచారణ కొనసాగుతుంది ఈడీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను అన్నారు. చీకోటి ప్రవీణ్ ఎవరికీ భయపడడు..విచారణ పూర్తి అయిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. సోషల్ మీడియాలో నా పేరుతో ఫేక్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలపారు. ఇప్పటికే ఇదే విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాను అని అన్నారు.

నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలని హైకోర్టులో పిటిషన్ వేశానని చీకోటి తెలిపారు. నేను క్యాసినో బిజినెస్ చేశాను.. చేయలేదు అని ఎప్పుడు చెప్పలేదు. అందులో తప్పేముందని వ్యాఖ్యానించారు. నాకు చాలామంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయ్.. అంతా మాత్రాన పని గట్టుకొని నాపై దుష్ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు. ఈడీ విచారణ పూర్తి అయిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తా అని పేర్కొన్నారు.

కాగా, తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇటీవలే కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కోట్ల రూపాయలు హవాలా ద్వారా లావాదేవీలు జరిగినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అంతే కాకుండా పలు దేశాల్లోనూ చీకోటి క్యాసినో క్యాంపులు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే చీకోటి ప్రవీణ్ తో పాటు, మాధవరెడ్డిలను కూడా ఈడీ ప్రశ్నిస్తూ వస్తోంది.